Telugu Global
NEWS

దొంగ దెబ్బ తీసే ఈనాడు కూడా జగన్‌ దెబ్బకు ముసుగు తీసేసింది...

గతంలో ఈనాడు పత్రిక ఎన్నికలు వచ్చే ఆఖరి వరకు బ్యాలెన్స్‌గా నటిస్తూ… తీరా ఎన్నికల సమయంలో ముసుగు తీసేసేదని… కానీ ఈసారి నాలుగు నెలలకే ముసుగు తీసేసిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఒక విధంగా జగన్‌మోహన్ రెడ్డికి మంచి చేసే పరిణామమే అన్నారు. వైఎస్‌లో నాయకత్వ లక్షణాలను తొలుత గుర్తించిందే ఈనాడు పత్రిక అని… ఆయన కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడు అవుతారని ముందే గుర్తించి… వైఎస్‌కు వ్యతిరేకంగా తొలి నుంచి ఈనాడు […]

దొంగ దెబ్బ తీసే ఈనాడు కూడా జగన్‌ దెబ్బకు ముసుగు తీసేసింది...
X

గతంలో ఈనాడు పత్రిక ఎన్నికలు వచ్చే ఆఖరి వరకు బ్యాలెన్స్‌గా నటిస్తూ… తీరా ఎన్నికల సమయంలో ముసుగు తీసేసేదని… కానీ ఈసారి నాలుగు నెలలకే ముసుగు తీసేసిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఒక విధంగా జగన్‌మోహన్ రెడ్డికి మంచి చేసే పరిణామమే అన్నారు.

వైఎస్‌లో నాయకత్వ లక్షణాలను తొలుత గుర్తించిందే ఈనాడు పత్రిక అని… ఆయన కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడు అవుతారని ముందే గుర్తించి… వైఎస్‌కు వ్యతిరేకంగా తొలి నుంచి ఈనాడు పత్రిక కథనాలు రాస్తూ వచ్చిందన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి గురించి కూడా ప్రారంభం నుంచే అవాస్తవాలతో కథనాలు రాస్తూ వచ్చారన్నారు. తమ దృష్టిలో ఈనాడు కంటే ఆంధ్రజ్యోతే నయమని… ఆంధ్రజ్యోతి కనిపించే శత్రువు అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్‌కు తాము వ్యతిరేకమని, చంద్రబాబుకు అనుకూలం అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బహిరంగంగా చెప్పుకుని వార్తలు రాస్తున్నారని… కాబట్టి ఆంధ్రజ్యోతి వల్ల తమకు ఇబ్బంది ఏమీ లేదన్నారు.

ఈనాడు మాత్రం బయటకు కనిపించకుండా దొంగదెబ్బ తీసే పత్రిక అని అభివర్ణించారు. సాధారణంగా ఈనాడు పత్రిక ఆఖరి వరకు ముసుగులోనే ఉంటూ తీరా ఎన్నికల సమయంలో ముసుగుతీసేసి దెబ్బతీసేందుకు ప్రయత్నించేదని… కానీ ఈసారి మాత్రం ఈనాడు పత్రిక కూడా బరి తెగించి నాలుగు నెలలకే అసలు రూపం చూపిస్తోందన్నారు. ఆలస్యం చేస్తే జగన్‌ పాతుకుపోతారన్న భావనలోనే ఈనాడు ఈసారి ఈ తరహాలో వ్యవహరిస్తోందన్నారు.

ఆఖరి వరకు బ్యాలెన్స్‌గా ఉంటూ ఆ తర్వాత ఈనాడు ముసుగు తీసి ఉంటే ఇబ్బందిగానే ఉండేదని… కానీ ఈసారి ఈనాడు ముందే ముసుగు తీసేయడం జగన్‌మోహన్ రెడ్డికి మంచి చేసేదే అన్నారు.

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు పత్రికలను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించారని… ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా తాము కూడా నిజాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తమది ఇప్పుడు టీడీపీతో పోరాటం కాకుండా… ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని టీవీ చానళ్లతో పోరాటంలా మారిందన్నారు కోటంరెడ్డి.

First Published:  1 Nov 2019 9:04 PM GMT
Next Story