అటుఇటు కాకుండా వస్తున్న వెంకీమామ

ముందు సంక్రాంతికే రిలీజ్ అంటూ లీకులు వదిలారు. ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో క్రిస్మస్ కు రాబోతున్నట్టు మళ్లీ మరో లీక్. అయితే భారీ కాంపిటిషన్ కారణంగా క్రిస్మస్ సెలవులకు కూడా వర్కవుట్ కాలేదు. పోనీ సంక్రాంతి సెలవుల తర్వాత వద్దామంటే అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. పైగా వడ్డీలు పెరిగిపోతాయి, మార్కెట్-హైప్ తగ్గిపోతుంది. అందుకే మధ్యేమార్గంగా సెలవుల్లేని టైమ్ లోనే వచ్చేయాలని ఫిక్స్ అయ్యారు.

అవును.. సంక్రాంతి కంటే ముందు, క్రిస్మస్ హాలిడేస్ కంటే ముందే వెంకీమామను థియేటర్లలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 20 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఆ టైమ్ కు డిస్కోరాజా, రూలర్, ప్రతిరోజు పండగ లాంటి సినిమాలు రెడీగా ఉన్నాయి. అందుకే డిసెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలోనే థియేటర్లలోకి వెంకీమామ సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు.

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకీ-నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఇది. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీగా, సెకెండాఫ్ అంతా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు. రాశిఖన్నా, పాయల్ రాజ్ పుల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో భారీ రెవెన్యూ అంచనా వేస్తున్నాడు సురేష్ బాబు. ఎందుకంటే అటు వెంకీ, ఇటు నాగచైతన్య ఇద్దరూ సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు.