బిగ్ బాస్ 3 విజేత ధూల్ పేట్ కుర్రాడు

అంతా ఊహించినట్టే జరిగింది. చివరికి ఫైనల్స్ లో కూడా లీకులే నిజమయ్యాయి. సింగల్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విజేతగా నిలిచాడు. చిరంజీవి చేతులు మీదుగా 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఎలాంటి అంచనాల్లేకుండా హౌజ్ లోకి వచ్చిన రాహుల్, ఊహించని విధంగా టైటిల్ విన్నర్ గా నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్, శ్రీముఖి బాగా డిసప్పాయింట్ అయ్యారు.

బిగ్ బాస్ ప్రారంభమైనప్పట్నుంచి వరుణ్ సందేశ్ ను అంతా టైటిల్ విన్నర్ గా చూశారు. దానికి తగ్గట్టే నడుస్తూ వచ్చాడు వరుణ్ కూడా. అదే సమయంలో శ్రీముఖి కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఈసారి శ్రీముఖి గెలుస్తుందని అంతా అనుకున్నారు కూడా. కానీ ఊహించని విధంగా రాహుల్ విజేతగా నిలిచాడు.

హౌజ్ లోకి వచ్చినప్పట్నుంచి పెద్దగా సీరియస్ గా కనిపించలేదు రాహుల్. ప్రతి విషయంలో లైట్ గా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే బద్ధకస్తుడు అనే బిరుదు కూడా అందుకున్నాడు. దీనికితోడు పునర్నవితో ఎఫైర్ ఒకటి. పొద్దున్న లేస్తే పునర్నవితో పులిహోర కలపడానికే రాహుల్ ప్రధాన్యత ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తికి టైటిల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ 50 ఎపిసోడ్ల తర్వాత రాహుల్ గేమ్ ప్లాన్ మారిపోయింది. మరీ ముఖ్యంగా పునర్నవి బయటకెళ్లిన తర్వాత రాహుల్ మరింత సీరియస్ అయ్యాడు.

ఇవన్నీ ఒకెత్తయితే.. రాహుల్ కు ఆఖరి నిమిషంలో పోలైన ఓట్లు మరో ఎత్తు. పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా.. రాహుల్ కు అనూహ్యంగా ఓట్లు పెరిగాయి. ఈ విషయంలో బయట నుంచి పునర్నవి, రాహుల్ కోసం బాగా వర్క్ చేసినట్టు టాక్. మొత్తమ్మీద బిగ్ బాస్ 3 విన్నర్ గా నిలిచిన రాహుల్, స్టార్ అయిపోయాడు.