Telugu Global
National

రామోజీ ముసుగు తీసేసిన కొమ్మినేని

జగన్ ప్రభుత్వంపై ఈనాడులో వస్తున్న రాతల పై కొమ్మినేని విశ్లేషణ ఇది…. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఈనాడు పత్రిక ఏమి చేయదలిచింది? వర్గాల వారిగా విడగొట్టి ద్వేషం నింపడమే ధ్యేయంగా పెట్టుకుందా? వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతోందా? చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకో లేకపోతోందా? విద్వేషంతో రగిలిపోతూ, ఆ విద్వేషాన్ని ప్రజలపై చిమ్ముతోందా? ఈనాడు లో రెండు రోజలపాటు సాగిన వరస కథనాలు, ఏకంగా సంపాదకీయం చూసిన తర్వాత […]

రామోజీ ముసుగు తీసేసిన కొమ్మినేని
X

జగన్ ప్రభుత్వంపై ఈనాడులో వస్తున్న రాతల పై కొమ్మినేని విశ్లేషణ ఇది….

ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఈనాడు పత్రిక ఏమి చేయదలిచింది? వర్గాల వారిగా విడగొట్టి ద్వేషం నింపడమే ధ్యేయంగా పెట్టుకుందా? వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతోందా? చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకో లేకపోతోందా? విద్వేషంతో రగిలిపోతూ, ఆ విద్వేషాన్ని ప్రజలపై చిమ్ముతోందా?

ఈనాడు లో రెండు రోజలపాటు సాగిన వరస కథనాలు, ఏకంగా సంపాదకీయం చూసిన తర్వాత కలిగిన అభిప్రాయం ఇది. మీడియాకు సంకెళ్లా? కలానికి సంకెళ్లా అంటూ గగ్గోలు పెడుతూ బ్యానర్ కథనాలు ఇవ్వడం..ఆ పక్కనే చంద్రబాబు పోటో వేసి ఆయన నియంతలు కూడా చేయని బరితెగింపు అని వ్యాఖ్య చేసినట్లు ప్రచురించడం, ఆ దిగువనే సమాచార స్వేచ్చపై ఎత్తిన కత్తి అని ఏకంగా సంపాదకీయమే రాయడం…. ఇవన్ని చూస్తే ఈ ఐదునెలల్లో జగన్ ప్రభుత్వం వచ్చాక ఈనాడు ఎంతగా అసహనంతో ఉందో ఈ వార్తల కవరేజీ, ఈ సంపాదకీయం తెలియచెబుతాయి.

నిజంగానే జగన్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెట్టిందా? ఏమి రాసినా కేసులు పెడతామని బెదిరించిందా? నిజాలు రాస్తే ఊరుకోనని అందా? పోని కొత్తగా ఏమైనా జిఓ ఇచ్చిందా. గతంలో ఇచ్చిన జిఓకు కొంత మార్పు చేసింది. గతంలో మీడియాలో కాని ఇతరత్రా కాని తప్పుడు వార్తలు రాస్తే ఖండనలు ఇవ్వడం, అవసరమైతే కేసులు పెట్టడం వంటి అధికారాన్ని సమాచార శాఖ కమిషనర్ వద్ద ఉండేది.

దానిని సవరించి ఇది ఆయా శాఖ అధిపతులు పరిశీలించి చర్య తీసుకోవచ్చని, నిరాధార వార్తలు రాస్తే అవసరమైతే, చట్ట ప్రక్రియ ప్రకారమే కేసులు పెట్టవచ్చని తెలిపింది. దీనిపై అభ్యంతరం చెప్పడం తప్పు కాదు. చెప్పిన తీరు, రాసిన వైనం మాత్రం అదేదో ప్రమాదం జరిగిపోయినట్లు గగ్గోలు పెట్టడమే బాగోలేదు.

తప్పు అయితే చంద్రబాబు ఏం చేశాడు?

నిజంగానే ఈ జిఓ అమలులో పెట్టదలుచకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఎందుకు రద్దు చేయలేదు? అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎందరు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టలేదు? ఎందరిని జైలులో పెట్టలేదు? అర్ధరాత్రి వేళ హైదరాబాద్ నుంచి మరీ తరలించి పోలీస్ స్టేషన్ ల చుట్టూ కొందరు సోషల్ మీడియావారిని తిప్పిందే.

ఏకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయం పైనే దాడి చేసిందే? అదంతా మీడియా పై దాడిలాగా ఈనాడు లేదా ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలకు సంపాదకులకు అనిపంచలేదా? కాపు ఉద్యమం జరుగుతుంటే ఆ వార్తలను మీడియాలో ప్రసారం కాకుండా చేసింది చంద్రబాబు నాయుడా? జగనా? అప్పుడు సాక్షి మీడియా ను నెలల తరబడి రాకుండా చేయడం పూర్తి స్వేచ్చగా రామోజీరావుగారికి కనిపించిందా?

ఎన్.టివి ని మూడు నెలలపాటు ప్రసారం కానివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుపై ఎన్నడూ ఒక్క వార్త అయినా రాయలేదే? ఒక సంపాదకుడిని అసలు టీవీ తెరపైనే కనిపించకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నించినప్పుడు అదంతా మీడియా స్వేచ్చగానే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నవారికి కనిపించిందా? కనీసం సంఘీభావం తెలియచేసినవారు ఎందరు ఉన్నారు.

నిజమే ఏ ప్రభుత్వం అయినా సమాచారానికి స్వేచ్చ ఇవ్వాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే కేసులు పెడితే తప్పే.అది ఎమర్జెన్సీ అవుతుంది. ఆ టైమ్ లో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాయడాన్నే అనుమతించలేదు. ఇప్పుడు అలాంటి విషయం ఏమన్నా జిఓలో ఉందా? అదేమీ లేకపోయినా ఎందుకు ఇంత గందరగోళం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా తప్పుడు కేసు పెడితే కచ్చితంగా గొడవ చేయవచ్చు. అసలు అలాంటిది ఏమీ లేదు కదా? ఎలాంటి తప్పుడు వార్తలు రాసినా ఫర్వాలేదని ఈనాడు, ఆంద్రజ్యోతి చెబుతున్నాయా? లేక తాము ఏమి రాసినా తమ జోలికి రావద్దని ఆ మీడియా వాదిస్తోందా?

స్వాతంత్ర్యం, స్వేచ్చ గురించి మాట్లాడే ఈ మీడియా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాదిస్తే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా కనీసం అభినందిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాయడానికే ఇష్టపడలేదే? అది రాయకపోతే మానే… తన ప్రభుత్వం నిజాయితీ ఉంటుందని, కులాలు, ప్రాంతాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ హోదా లో ప్రకటిస్తే మంచి నిర్ణయం అని కూడా వ్యాఖ్యానించలేదే?

తాను ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలలోని పలు అంశాలను అమలు చేస్తూ ముందుకు వెళుతుంటే ఎక్కడా మెచ్చుకోలేదే? పైగా వాటికి పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారే. అగ్రిగోల్డ్ భాదితులు పలువురు చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని తెలుగుదేశం మీడియా, ఇప్పుడు జగన్ వారికి న్యాయం చేస్తుంటే ప్రశంసించలేదే?

ఇసుక..ఇసుక అంటూ ఉన్నవి, లేనివి రాస్తున్నారే? వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నా ఇసుక కు లింక్ పెట్టి మరీ మొదటి పేజీలలో వడ్డిస్తున్నారే? గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయకపోయినా చంద్రబాబు చేసిన రుణమాఫీతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేశారే? అంత గొప్ప రుణమాపీ ఎక్కడ జరగలేదన్నంతగా బిల్డప్ ఇచ్చారే… అయినా ఫర్వాలేదు. కానీ జగన్ రైతులకు భరోసా కింద పన్నెండువేల రూపాయల చొప్పున ఇస్తే అందులో వంకలు వెదికారు కాని, హామీని ముందుగానే అమలు చేశారని ఒక్క ముక్క అనలేకపోయారే?

చింతమనేని ప్రభాకర్ అన్ని అరాచకాలకు పాల్పడితే ఎన్నడైనా ఈనాడు వేలెత్తి చూపిందా? ఇప్పుడు మాత్రం అక్రమ కేసులని ప్రచారం చేస్తున్నారే? కోడెలకు ఈనాడు యాజమాన్యంతో ఉన్న అనుబంధం తెలియనిది కాదు. దాంతో కోడెల పై ఒక్క ఈగ కూడా వాలకుండా కాపాడే యత్నం చేశారే. చివరికి టిడిపి కార్యకర్తలే కోడెలపైన, కోడెల కుటుంబంపైన పిర్యాదులు చేస్తే , కుటుంబం నుంచి, చంద్రబాబు నుంచి ఆదరణ లేక పరువు పోయిందన్న బాధతో కోడెల ఆత్మహత్య చేసుకుంటే.. కోడెల ప్రభుత్వ వేదింపుల వల్ల చనిపోయాడన్న విమర్శలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారే?

అంటే మీడియా ఎక్కడ తప్పులు జరిగినా, ఎవరు తప్పులు చేసినా ఎత్తి చూపాలి కదా? అలాకాకుండా పార్టీ పరంగానో, కులం పరంగానో ఆలోచించి మద్దతు ఇస్తున్నారన్న విమర్శకు ఈనాడు కాని మరో మీడియా కాని ఎందుకు ఆస్కారం ఇస్తోంది. ఒకప్పుడు రామోజీరావు నిజం అయితే రాయండి..అబద్దం అయితే రాయొద్దు అని హితోక్తులు చెప్పేవారే. మరి అలాంటి ఆయనకు ఏమైంది? తెలుగుదేశం అబద్దాలకు అక్షరమాలలు వేస్తున్నారే? అంటే చంద్రబాబు ప్రయోజనాలే ఈనాడు ప్రయోజనాలుగా వారు భావిస్తున్నారని అనుకోవాలా?.

చంద్రబాబుకు పదవి పోతే రామోజీ దిగులు పడుతున్నాడు

ఒక నానుడి ఉంది. తనకు బాద కలిగితే ప్రపంచం అంతా బాధపడాలని, ప్రపంచం అంతా బాధపడుతున్నా తనకు బాధ లేకపోతే పట్టించుకోరాదని, సరిగ్గా ఈనాడు బాధ అలాగే ఉంది. చంద్రబాబుకు పదవి పోతే వీరికి పదవి పోయినట్లు ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం ఓడిపోతే వీరు ఓడిపోయినట్లుగా విచారపడుతున్నారు.

తమ కోడి కూయకపోతే తెల్లవారదన్నట్లుగా చాలకాలం వీరి హవా నడిచింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వీరి కోడికోసమే జనం చూడడం లేదు. ఎవరికి వారికి సొంత కోళ్లు వచ్చేశాయి. వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అందువల్ల 2019 ఎన్నికలలో వీరి పప్పులు ఉడకలేదు. అదే వీరి బాధ.

పైగా జగన్ తన కార్యక్రమాలతో ప్రజలలో నిలదొక్కుకుని పోతే తమ ప్రయోజనాలకు విఘాతం అని వారి భయం. అందుకే ప్రభుత్వాన్ని సాద్యమైనంత త్వరగా, వీలైనంత ఎక్కువగా డామేజీ చేయాలన్నది వారి లక్ష్యం. కాని వారి ప్రయత్నాలు సఫలం కావని తెలుసుకోకపోతే వారికే నష్టం.

First Published:  5 Nov 2019 4:50 AM GMT
Next Story