పడిపోయింది…. ఇక లేవడం కష్టం

మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. కాకపోతే వీకెండ్ కావడం వల్ల మల్టీప్లెక్సుల్లో ఫర్వాలేదనిపించుకుంది. దీంతో యూనిట్ కూడా కాస్త హంగామా చేసింది. కానీ నిన్నటి వసూళ్లతో “మీకు మాత్రమే చెప్తా” సినిమా జాతకం తేలిపోయింది. సోమవారం ఈ సినిమా వైపు ఎవ్వరూ చూడలేదు. అలా శుక్ర,శని,ఆదివారాలు మెరిసిన ఈ సినిమా.. సోమవారంతో పూర్తిగా పడిపోయింది. ఇక లేవడం కూడా కష్టమంటోంది ట్రేడ్.

సినిమా క్వాలిటీ బాగాలేదు. కంటెంట్ కూడా సినిమాకు తక్కువ, వెబ్ సిరీస్ కు ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లను ఎట్రాక్ట్ చేసే స్టఫ్ కాదు. అందుకే సినిమా ఒక్కసారిగా పడిపోయింది. విడుదలైన మొదటి 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 4 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. అంతవరకు ఓకే కానీ, ఇకపై ఎంతమాత్రం ఈ సినిమాకు వసూళ్లు రావనేది తథ్యం.

ఆశ్చర్యకరంగా ఖైదీ సినిమాకు సోమవారం కూడా వసూళ్లు తగ్గలేదు. మౌత్ టాక్ బలంగా ఉండడంతో ఈ సినిమా దూసుకుపోతోంది. దీని తర్వాత స్థానంలో విజిల్ సినిమా ఉంది. అలా టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రమే నడుస్తున్నాయి. సైరా సినిమా దుకాణం సర్దేసిన సంగతి తెలిసిందే.