నానితో సినిమా…. అంతా ఉత్తిదే

గతంలో నాని-శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్నుకోరి అనే సినిమా వచ్చింది. అది పెద్ద హిట్ అయింది. ఆ వెంటనే శివ నిర్వాణకు మరో ఛాన్స్ కూడా ఇచ్చాడు నాని. మంచి కథతో వస్తే కాల్షీట్లు ఇస్తానన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అదే పనిలో ఉన్నాడు కూడా. ఇంతలోనే వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఓకే అయిందంటూ పుకారు వచ్చింది. నిజమని నమ్మేలే షైన్ స్క్రీన్ బ్యానర్ పేరిట ఓ పోస్టర్ కూడా రిలీజైంది.

కానీ మేటర్ ఏంటంటే.. నాని-శివ నిర్వాణ సినిమా ఇంకా లాక్ అవ్వలేదు. ప్రస్తుతం వీళ్లిద్దరూ చర్చల దశలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా నానితో సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు శివ నిర్వాణ. ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే నానితో మూవీ ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాజెక్టు లేదని స్వయంగా శివ నిర్వాణ ప్రకటించడంతో ఈ పుకార్లకు చెక్ పడింది.

మరోవైపు ఇంకా లాక్ అవ్వని ఈ ప్రాజెక్టులో సమంత హీరోయిన్ అనే ప్రచారం కూడా మొదలుపెట్టారు పుకారురాయుళ్లు. గతంలో నాని-సమంత కాంబోలో ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారంటూ రూమర్లు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదంటూ సమంత వైపు నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది.