చిరంజీవి సినిమా హీరోయిన్ ఫిక్స్

మొన్నటివరకు అనుష్క పేరు గట్టిగా వినిపించింది. ఒక దశలో సైరాలో నటించిన నయనతారనే రిపీట్ చేస్తారని కూడా అనుకున్నారు. ఎట్టకేలకు రూమర్లకు చెక్ పడింది. చిరంజీవి కొత్త సినిమా హీరోయిన్ ఫిక్స్ అయింది. కొరటాల దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈమధ్యే చెన్నై వెళ్లొచ్చాడు దర్శకుడు కొరటాల. త్రిషకు కంప్లీట్ నెరేషన్ ఇచ్చాడు. త్రిషకు స్టోరీ నచ్చింది, పైగా చిరంజీవి సినిమా. అన్నింటికీ మించి టాలీవుడ్ లో అవకాశం. వెంటనే ఓకే చెప్పేసింది. కాకపోతే ఇంకా అగ్రిమెంట్ మీద సంతకాలు పూర్తికాలేదు.

గతంలో చిరంజీవి-త్రిష కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో చిరు సరసన త్రిష చాలా చిన్నమ్మాయిగా కనిపించింది. కానీ ఇప్పుడు త్రిష కూడా 30 దాటేసింది కాబట్టి చిరంజీవి సరసన ఆమెను చూపించడానికి దర్శకుడు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.