ఆడియో సూపర్ హిట్.. ఇప్పుడు వీడియో

అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమన అనే పాట రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. అలా ఆడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటను ఇప్పుడు పిక్చరైజ్ చేస్తున్నారు.

ఈ సాంగ్ షూటింగ్ కోసం యూరోప్ వెళ్లింది యూనిట్. పారిస్ తో పాటు పలు అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. పాట ఆడియో పరంగా ఎంత హిట్ అయిందో, వీడియో పరంగా కూడా అంతే హిట్ అవుతుందని అంటోంది యూనిట్.

సామజవరగమన పాటను 70 మిలియన్ల మంది వీక్షించగా… దాదాపు 9 లక్షల మంది లైక్ చేశారు. సౌతిండియాలోనే ఇదో పెద్ద రికార్డు. ఊహించని విధంగా హిట్ అయిన ఈ పాటను విజువల్ పరంగా కూడా అంతే హిట్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. అందుకే యూరోప్ వెళ్లింది.

అయితే టాలీవుడ్ కు ఓ సెంటిమెంట్ ఉంది. ఆడియో పరంగా హిట్ అయిన ఏ పాట కూడా వీడియో పరంగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే అంచనాలు భారీగా ఉండడంతో ఎంత బాగా పిక్చరైజ్ చేసినా, వీడియో పరంగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

గీతగోవిందం, అజ్ఞాతవాసి, అరవింద సమేతలో పాటలు ఇలానే ఆడియోతో హిట్ కొట్టి, వీడియో పరంగా ఫెయిల్ అయ్యాయి. మరి ఈసారి బన్నీ-త్రివిక్రమ్ కలిసి విజువల్స్ పరంగా కూడా జనాలతో “సామజవరగమన” అనిపిస్తారేమో చూడాలి.