ఇసుక వల్లే చనిపోయాడని చెప్పండి… 5లక్షలు ఇప్పిస్తాం – శవంతో ఈటీవీ, టీవీ5 ప్రతినిధుల రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక రాజకీయం నడుస్తోంది. చంద్రబాబుకు తోడుగా మీడియా కూడా ఈ అంశాన్ని తమ భుజాలపై వేసుకుని వార్తలను సృష్టిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోగా… మృతుడి కుటుంబసభ్యులతో నేరుగా ఈటీవీ, టీవీ5 ప్రతినిధులు చర్చలు జరిపిన అంశం కలకలం రేపుతోంది.

బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన 39 ఏళ్ల రమేష్ సోమవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతకాలంగా రమేష్ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హఠాత్తుగా ఎక్కడైనా ఫిట్స్‌తో పడిపోతూ ఉండేవాడు. ఆ బాధతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.

ఇలా రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే ఈటీవీ, టీవీ5 ప్రతినిధులు అక్కడ వాలిపోయారు. ఆత్మహత్యకు కారణం ఇసుక కొరత వల్ల ఉపాధి లేకపోవడమే అని చెప్పండి…. మేం కూడా టీవీల్లో అలాగే చూపిస్తాం… మీకు 5 లక్షలు వచ్చేలా చూస్తామంటూ రెండు చానళ్ల ప్రతినిధులు తమకు హామీ ఇచ్చారని రమేష్ సోదరుడు నలుకుర్తి సురేష్ వివరించారు.

ఐదు లక్షలు ఇస్తామని చెప్పడంతో తొలుత తాము ఈటీవీ, టీవీ5 ప్రతినిధులు చెప్పినట్టుగానే ఇసుక కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పామని సురేష్ వివరించారు. కానీ మీడియా చానళ్ల వారు తమను వాడుకునేందుకు తప్పుదోవ పట్టించారని తెలిసిన తర్వాత ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

తన సోదరుడికి ఫిట్స్ వస్తుంటుందని.. ఎక్కడపడితే అక్కడ పడిపోయేవాడని దాంతో ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు సురేష్ వివరించారు. తన సోదరుడు తాపిమేస్త్రీ కాదని వివరించారు. ఆరోగ్యం బాగున్న సమయంలో పొలం పనులకు వెళ్లేవాడని వెల్లడించారు.