బిగ్ బాస్ పై రాహుల్ ఆరోపణలు

బిగ్ బాస్ పై హేమ ఆరోపణలు చేసిందంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆమె అందరికంటే ముందే ఎలిమినేట్ అయిపోయింది. పోనీ అదే బిగ్ బాస్ పై శ్రీముఖి ఆరోపణలు చేస్తే అర్థముంది. ఎఁదుకంటే, ఆమె కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓడిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా గెలిచిన రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3పై విమర్శలు చేశాడు. అవును.. తనకు పేమెంట్ లో అన్యాయం జరిగిందంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్

సీజన్3 విన్నర్ గా గెలిచిన రాహుల్.. హౌజ్ లో గడిపిన రోజుల్లో తనకు చాలా తక్కువ మొత్తం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. తను బయట ఓ కన్సర్ట్ చేస్తే ఎంత వస్తుందో.. అంత మొత్తాన్ని తనకు వారం రోజులకు గాను ఇచ్చేవారని స్పష్టంచేశాడు. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం రాహుల్ బయటపెట్టలేదు. పైకి చెప్పుకోలేనంత తక్కువ ఎమౌంట్ అని మాత్రం అన్నాడు.

బిగ్ బాస్ హౌజ్ లో హేమకు డెయిలీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. అటు శ్రీముఖికి కూడా రోజువారీ పారితోషికం ఉంది. వీళ్లతో పాటు చాలామందికి రోజుకు ఇంత అని ఫిక్స్ చేశారు. కానీ రాహుల్ కు మాత్రం వారానికి ఒకసారి పేమెంట్ ఇవ్వడం, అది కూడా చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడం ఇప్పుడు సంచలన విషయంగా మారింది. దీనికితోడు అతడికిచ్చిన ప్రైజ్ మనీలో కూడా కోత పడింది. 50లక్షల ప్రైజ్ మనీలో టాక్స్ పోను అతడి చేతికి అటుఇటుగా 38లక్షల రూపాయలు మాత్రమే వచ్చినట్టు చెబుతున్నారు.