వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన రజనీకాంత్

నిన్న సాయంత్రం నుంచి ఓ వెరైటీ వివాదం టాలీవుడ్ లో మొదలైంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రతి భాషలో ఆయా పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్స్ తో రిలీజ్ చేయాలనుకున్నారు. దీనికి తగ్గట్టే ప్లాన్ చేశారు. హిందీలో ఈ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేయబోతున్నాడు. అలాగే మలయాళంలో మోహన్ లాల్, తమిళ్ లో కమల్ హాసన్ రిలీజ్ చేస్తారు. కానీ టాలీవుడ్ కు వచ్చేసరికి మాత్రం మేకర్స్ లైట్ తీసుకున్నారు.

తెలుగు మోషన్ పోస్టర్ ను కూడా కమల్ హాసన్ చేతులమీదుగానే రిలీజ్ చేయాలని నిన్నటి వరకు అనుకున్నారు. కానీ తెలుగులో సూపర్ స్టార్ లేరా అంటూ సరికొత్త కాంట్రవర్సీ మొదలైంది. దర్బార్ యూనిట్ పై ట్రోలింగ్ ఎక్కువైంది. రజనీకాంత్ లేదా మురుగదాస్ చొరవ తీసుకుంటే స్వయంగా చిరంజీవి లాంటి పెద్ద హీరో ఈ కార్యక్రమానికి అంగీకరిస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు. కానీ తెలుగులో స్టార్స్ లేనట్టు దర్బార్ యూనిట్ వ్యవహరించింది.

వివాదం గంటగంటకు ఎక్కువవ్వడంతో యూనిట్ వెనక్కి తగ్గింది. తెలుగు మోషన్ పోస్టర్ ను మహేష్ చేతులమీదుగా లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. తెలుగులో చిరంజీవి తర్వాతే ఎవరైనా. ఈ విషయం తెలిసి కూడా చిరంజీవిని కాదని మహేష్ తో ఎలా లాంఛ్ చేయిస్తారంటూ మరో కొత్త వివాదం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ లాంచ్ అవుతుంది.