భూపతి పోయే…రాజ్ పాల్ వచ్చే…

  • తటస్థవేదికలో భారత్- పాక్ డేవిస్ కప్ సమరం

భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మహేశ్ భూపతి మూడేళ్ల షో ముగిసింది.పాకిస్థాన్ తో ఈనెల ఆఖరి వారంలో జరిగే ఆసియా-ఓషియానా డేవిస్ కప్ జోనల్ సమరంలో భారతజట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా రోహిత్ రాజ్ పాల్ వ్యవహరించనున్నాడు.

ఈ విషయాన్ని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. రోహిత్ రాజ్ పాల్ నాయకత్వంలోని భారతజట్టులో వెటరన్ లియాండర్ పేస్, సాకేత్ మైనేని, జీవన్ నేడుంజెళియన్, శ్రీరామ్ బాలాజీకి చోటు దక్కే అవకాశాలున్నాయి.

ఇస్లామాబాద్ టు తటస్థవేదిక…

భారత్-పాక్ జట్ల డేవిస్ కప్ సమరం ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే..ఉగ్రవాదుల అడ్డా పాకి్స్థాన్ లో తమ భద్రతకు హామీలేని కారణంగా.. తటస్థవేదికలో నిర్వహించాలంటూ భారత టెన్నిస్ సంఘం…అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యకు మొరపెట్టుకొంది.

మరోవైపు…పాక్ వేదికగా జరిగే డేవిస్ కప్ సమరానికి తాము భద్రతా కారణాలతో అందుబాటులో ఉండబోమని కెప్టెన్ మహేశ్ భూపతి, డబుల్స్ సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ప్రకటించడంతో…భారత టెన్నిస్ సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైన దృష్టి పెట్టింది.

పేస్, సాకేత్ రెడీ…

ఇస్లామాబాద్ వేదికగా జరిగే డేవిస్ కప్ సమరంలో పాల్గొనటానికి తాము సిద్ధమంటూ వెటరన్ లియాండర్ పేస్, సాకేత్ మైనేని వంటి ఆటగాళ్లు ముందుకు వచ్చారు.

ఇదే సమయంలో…ఇస్లామాబాద్ కు బదులుగా ఓ తటస్థ వేదికలో డేవిస్ కప్ పోరు నిర్వహించాలంటూ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఆదేశించడంతో.. అంచనాలు తారుమారయ్యాయి.

మహేశ్ భూపతి స్థానంలో రోహిత్ రాజ్ పాల్ ను కెప్టెన్ గా నియమించడంతో..రోహన్ బొపన్న లాంటి సీనియర్ ఆటగాళ్ల గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లయ్యింది.

తటస్థ వేదికలో మ్యాచ్ ప్రకటన చోటు చేసుకోక ముందే…జట్టు కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ రోహన్ బొపన్న ట్వీట్ చేయటాన్ని, ప్రశ్నించడాన్ని భారత టెన్నిస్ సంఘం ప్రధాన కార్యదర్శి హిరణ్మయి చటర్జీ తప్పుపట్టారు.

ఆటగాళ్లు ఆటకే పరిమితం కావాలని, నిర్ణయాలు, పాలనా వ్యవహారాలలో జోక్యోం చేసుకోరాదంటూ హితవు చెప్పారు. ఎవరిని నియమించాలో…ఎవరిని తొలగించాలో.. టెన్నిస్ సంఘం చూసుకొంటుందని, అది టెన్నిస్ సంఘం బాధ్యత, హక్కుకూడానంటూ స్పష్టం చేశారు.

మహేశ్ భూపతి ఖేల్ ఖతం…

2016లో ఆనంద్ అమృత్ రాజ్ చేతి నుంచి భారతజట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన మహేశ్ భూపతి…గేమ్ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగే డేవిస్ కప్ సమరానికి తాను భద్రతా కారణాలతో అందుబాటులో ఉండబోనని భూపతి ప్రకటించడంతో…రోహిత్ రాజ్ పాల్ ను నియమించింది. దీంతో ఇప్పటికీ తానే కెప్టెన్ ను అంటూ మహేశ్ భూపతి ప్రకటించాడు.

మహేశ్ భూపతి తానే కెప్టెన్ అంటూ ప్రకటించుకోడాన్ని భారత టెన్నిస్ సంఘం తప్పుపట్టింది. మహేశ్ భూపతి కాంట్రాక్టు 2018లోనే ముగిసిందని…అతని కాంట్రాక్టును, ఇటలీతో మ్యాచ్ వరకూ పొడిగించామని…అంతటితో భూపతి కథ ముగిసినట్లేనని తేల్చిచెప్పింది.

నవంబర్ 29, 30 తేదీలలో పాకిస్థాన్ తో జరిగే డేవిస్ కప్ తటస్థ సమరంలో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.