రాజ్ కోట రాజా భారత్

  • రెండో టీ-20లో రోహిత్ శర్మ సూపర్ హిట్

బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ టీ-20 సిరీస్ లోని రెండో టీ-20లో భారత్ చేలరేగిపోయింది. రాజ్ కోట వేదికగా ముగిసిన డూ ఆర్ డై మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పి 8 వికెట్ల అలవోక విజయం అందించాడు.

సిరీస్ ను 1-1తో సమం చేయటం ద్వారా తనజట్టును సమఉజ్జీగా నిలిపాడు. సిరీస్ లోని నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్…ఈనెల 10న నాగపూర్ వేదికగా జరుగనుంది.

బంగ్లాకు పగ్గాలు…..

న్యూఢిల్లీలో ముగిసిన తొలి మ్యాచ్ లో 7 వికెట్లతో పరాజయం పొందిన భారత్ నెగ్గితీరాల్సిన రెండోమ్యాచ్ లో దెబ్బతిన్న బెబ్బులిలా రెచ్చిపోయింది. బంగ్లాపై విరుచుకు పడింది.

ఈ కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ నైమ్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చహార్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ శర్మ టాప్ గేర్…

154 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్- శిఖర్ ధావన్…సెంచర భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 10.5 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 108 పరుగుల భాగస్వామ్యం సాధించడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశారు.

ధావన్ 27 బాల్స్ లో 31 పరుగులు సాధించగా…కెప్టెన్ రోహిత్ శర్మ 43 బాల్స్ లో 85 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.6 బౌండ్రీలు, 6 సిక్సర్లతో తన కెరియర్ లో 22వ హాఫ్ సెంచరీ సాధించాడు.

రాహుల్ 8, శ్రేయస్ అయ్యర్ 24 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 15,4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ తో ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 10 టీ-20 మ్యాచ్ ల్లో 5వ ర్యాంకర్ భారత్ కు ఇది 9వ గెలుపు కావడం విశేషం.