కేసీఆర్‌ తీరు వెనుక కుట్ర

ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌ తీరు సరిగా లేదని టీఆర్‌ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ విషయంలో పట్టింపులకు పోకుండా కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకాల్సిందిగా కోరుతూ సీఎంకు డీఎస్ లేఖ రాశారు. అలా చేస్తే ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు, దాని వెనుక ఆర్థిక కోణాలు ఉన్నాయన్న ఆరోపణలకూ ముగింపు పలికినట్టు అవుతుందని సూచించారు.

ఆర్టీసీ కార్మికుల పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని డీఎస్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే పరిస్థితుల్లో కూడా కార్మికులకు వారి కుటుంబాలు అండగా ఉంటున్నాయని, వారి తీరులో దశాబ్దాల తెలంగాణ మట్టిలోని ధైర్యం పరిమళిస్తోందన్నారు.. 48 వేల మంది కార్మికుల మెడ మీద కత్తి పెట్టినా కనీసం ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచక నిలబడిన ధైర్యంలో తెలంగాణ శౌర్యం కన్పిస్తోందన్నారు.

ఏపీ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ విభజన పూర్తికాకముందే, టీఎస్ఆర్టీసీ సంస్థ అధికారికంగా మనుగడలోకి రాకముందే, సంస్థలో వాటా ఉన్న కేంద్రం నుంచి ఎలాంటి ఆమోదం లేకుండానే ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం సాధ్యం కాదనే విషయం కేసీఆర్‌కు తెలియంది కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల స్వభావానికి విరుద్ధంగా ఇంత కఠినంగా కేసీఆర్ వ్యవహరించడం చూస్తుంటే ఎవరో కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.

తెలంగాణ ప్రజలు బెదిరింపులకు తలవంచరని తెలిసి కూడా… కార్మికులే కాకుండా వారి కుటుంబాల వారిని కూడా బెదిరించే దుస్సాహసానికి పాల్పడుతున్న వారెవరో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ ఒక ఇంటి పెద్దగా ఆలోచించి సమస్యను పరిష్కరించాలని డీఎస్‌ కోరారు.