సొంత డబ్బులతో హీరోగా ప్రయత్నం

ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు, కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. ఇతడు హీరోగా మారడానికి ఇప్పటికే ఓసారి ప్రయత్నించాడు. శశి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా సినిమా లాంఛ్ అయింది. కాని ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో గల్లా జయదేవ్ ఈసారి స్వయంగా రంగంలోకి దిగాడు. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు తనే ఓ బ్యానర్ స్థాపించాడు.

అలా తన సొంత డబ్బుతో హీరోగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు గల్లా అశోక్. ఈ ప్రాజెక్టుకు ఆదిత్య శ్రీరామ్ దర్శకుడు. నాగ్-నాని నటించిన దేవదాస్ సినిమా తర్వాత శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు

ఈ సినిమా రామానాయుడు స్టుడియోస్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. రామ్ చరణ్, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేష్ బాబు ఎప్పట్లానే ఈ ప్రారంభోత్సవానికి రాలేదు. ట్విట్టర్ లో మేనల్లుడికి తన ఆశీర్వచనాలు మాత్రం అందించారు. ఈ రోజు ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచే మొదలుకాబోతోంది.