స్టుడియో రౌండప్ (10-11-2019)

అల వైకుంఠపురములో

అల్లుఅర్జున్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. సంక్రాంతి కానుకగా 12వ తేదీన విడుదలకాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన సామజవరగమన అనే పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ఇటలీలోని కాస్ట్ లీ లొకేషన్లను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం క్యాబరే ప్రదర్శనలకు పాపులర్ అయిన లొకేషన్ లో సాంగ్ ను షూట్ చేస్తున్నారు.

జాన్

పైన చెప్పిన విధంగా, పూజా హెగ్డే బన్నీ సినిమాతో బిజీగా ఉండడంతో ఆమె నటించాల్సిన జాన్ మూవీని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. ఆమె వచ్చిన తర్వాత 18వ తేదీ నుంచి జాన్ షెడ్యూల్ మొదలవుతుంది. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్నారు.

ఎంత మంచివాడవురా

కల్యాణ్ రామ్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎంతమంచివాడవురా. సతీశ్ వేగేశ్న డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. కేరళలోని మున్నార్ లో నిన్నటితో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. దీంతో టోటల్ మూవీ పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నారు.

V మూవీ

నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న సినిమా V. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. 80శాతం షూటింగ్ పూర్తయినట్టు గతంలోనే ప్రకటించారు. నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయబోతున్నారు.

కార్తికేయ

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న ’90ml’ తాజాగా అజర్ బైజాన్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 8 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో 3 పాటలు పిక్చరైజ్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు

మహేష్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. దాదాపు నటీనటులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు ఓ గ్రూప్ ఫొటో కూడా రిలీజ్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.