బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌కు భారీ స్పందన…. సేవల ప్రభావంపై పరిశీలన

బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్చంద పదవీ విరమణ ( వీఆర్‌ఎస్‌) పథకానికి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే 57వేల మంది వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో లక్షా 50వేల మంది ఉద్యోగులుండగా… వారిలో లక్ష మంది వీఆర్‌ఎస్‌కు అర్హులు. వీఆర్‌ఎస్‌ ద్వారా 77వేల మందిని పంపించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. 2020 జనవరి 31 వరకు ఈ వీఆర్‌ఎస్‌ పథకానికి గడువు ఉంది. 77 వేల మందికి వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకోగా… వస్తున్న స్పందన బట్టి ఈ సంఖ్య 80వేల మంది వరకు వెళ్లవచ్చని భావిస్తున్నారు.

ఇలా సగానికి పైగా ఉద్యోగులు వీఆర్‌ఎస్‌లో వెళ్లిపోతే దాని ప్రభావం బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలపైనా ఖచ్చితంగా ఉంటుంది. సంస్థలో వాతావరణమే మారిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్న తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

ఏఏ ప్రాంతంలో ఎంత మంది వెళ్లిపోతున్నారు…. అక్కడ సేవలు యథాతథంగా కొనసాగించేందుకు అవసరమైన సిబ్బంది ఎంత మంది అన్న దానిపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు.

పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవుట్‌ సోర్సింగ్‌పైనా ఆధారపడే యోచనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉంది. 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులు ఈ వీఆర్‌ఎస్‌ పథకానికి అర్హులు.

వీఆర్‌ఎస్ తీసుకున్న ఉద్యోగులకు సర్వీస్ పూర్తి చేసిన కాలానికి గాను ఏడాదికి 35 రోజులు, మిగిలి ఉన్న పదవి కాలానికి సంబంధించి ఏడాదికి 25 రోజుల చొప్పున ఎక్స్‌గ్రేషియా లెక్కించి చెల్లిస్తారు.