కొడుకును ఓక్రిడ్జ్‌లో ఇంగ్లీష్‌ మీడియంలో చేర్చి జనానికి సూక్తులు చెబుతున్న పవన్‌

ప్రభుత్వ స్కూళ్లల్లో తెలుగు సబ్జెట్‌ను తప్పనిసరి సబ్జెట్‌ను చేస్తూనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు మేధావులు, బడాబాబులు, పెద్దపెద్ద రాజకీయ నాయకులు పెదెత్తున ఆందోళన చేస్తున్నారు.

ఈనాడు పత్రికాధినేత నడుపుతున్న రమాదేవి స్కూల్‌లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం తెలుగు మీడియమే ఉండాలని రామోజీ పత్రిక కూడా పట్టుబడుతోంది. తన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్‌లో ఇంగ్లీష్‌ మీడియంకు పెద్దపీట వేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగు మీడియం కోసం టీడీపీ అనుకూల పత్రికలో వ్యాసం రాశారు.

పవన్‌ కల్యాణ్ మరో అడుగు ముందుకేసి తెలుగును రక్షించాలంటూ తన ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. కవుల పుస్తకాల కవర్ పేజీలను ట్వీట్ చేస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రాన్ని చూసి జగన్‌ నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశారు పవన్. అయితే పేదలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండాల్సిందే అని పట్టుబడుతున్న పవన్ కల్యాణ్ మరి తన పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.

పవన్ కల్యాణ్ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించే పెద్దపెద్ద స్కూళ్లలోనే చదువుతున్నారు. పవన్ కల్యాణ్ కుమారుడు అకిర… హైదరాబాద్ ఓక్రిడ్జ్‌ స్కూల్లో చదివాడు. కుమారుడిని ఓక్రిడ్జ్‌లో చేర్చిన సందర్భంగా ఆ స్కూల్‌ను ప్రమోట్ చేస్తూ పవన్ కల్యాణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తన కుమారుడికి స్కూల్‌కు వెళ్లడం అంటే పెద్దగా ఇష్టం ఉండదని.. కానీ ఓక్రిడ్జ్‌లో చేర్చిన తర్వాత క్రమం తప్పకుండా వెళ్తున్నాడని పవన్ చెప్పారు.

ఓక్రిడ్జ్‌లో వాతావరణం చాలా బాగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తన కుమారుడిని ఇలా ఇంగ్లీస్ మీడియం స్కూల్‌లో చేర్పించిన పవన్ కల్యాణ్…. పేద విద్యార్థులు, వెనుక బడిన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తెలుగు మీడియం కోసం పట్టుబడడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు ఉద్దరణ గురించి మాట్లాడుతున్న పెద్దలంతా ముందు వారి పిల్లలను తెలుగు మీడియం స్కూళ్లల్లో చేర్పించి అప్పుడు సమాజానికి నీతులు చెప్పాలంటూ పలువురు విమర్శిస్తున్నారు. కుమారుడిని ఓక్రిడ్జ్‌లో చేర్పించిన పవన్ కల్యాణ్‌… జనానికి మాత్రం సూక్తులు చెప్పడం ఏమిటని వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు.