అటు షూటింగ్.. ఇటు కథా చర్చలు

ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు హ్యాండిల్ చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాద్. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన గోవాలో. అవును.. ప్రస్తుతం ఈ డైరక్టర్ గోవాలో ఉన్నాడు. తనయుడు ఆకాష్ పూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ అనే సినిమా షూటింగ్ గోవాలోనే జరుగుతోంది. 30 రోజుల పాటు కొనసాగే ఈ షూటింగ్ ను పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు.

ఓవైపు రొమాంటిక్ మూవీని పర్యవేక్షిస్తూనే, ఇంకోవైపు విజయ్ దేవరకొండతో చేయబోయే ఫైటర్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు పూరి. ఈ సినిమాకు సంబంధించి విజయ్-పూరి ఇద్దరూ కలిసి కూర్చొని స్టోరీ ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం స్క్రీన్ ప్లే రాసే పనిలో ఉన్నాడు పూరి. అది పూర్తయిన వెంటనే మరోసారి ఇద్దరూ కలిసి కూర్చుంటారు.

ఈ రెండు పనులు చేస్తూనే, మరోవైపు తన ఫిజిక్ పై కూడా దృష్టిపెట్టాడు పూరి జగన్నాధ్. జిమ్ లో కసరత్తులు చేస్తూ కాస్త తగ్గే పనిలో పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ ఇలా ఒకేసారి బిజీ అయ్యాడు. త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి సెట్స్ పైకి రాబోతున్నాడు.