ఎలుక దెబ్బకు 11 గంటల పాటు ఆగిన విమానం

శంషాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం దాదాపు 11 గంటల పాటు నిలిచిపోయింది. హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లాల్సిన విమానం ఆదివారం ఉదయం 6గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయం మించిపోయినా అధికారుల నుంచి ప్రయాణికులకు ఆహ్వానం రాలేదు.

సమయం మించిపోయిన తర్వాత విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రకటన ఇచ్చారు. ఎనిమిది గంటలు దాటిపోయిన తర్వాత మధ్యాహ్నం 3గంటలకు విమానం బయలుదేరుతుందని చెప్పారు. అసలు కారణం మాత్రం తొలుత ప్రయాణికులకు చెప్పలేదు.

చివరకు సాయంత్రం 5 గంటల తర్వాత విమానం గాల్లోకి ఎగిరింది. దాదాపు 11 గంటల పాటు ఆలస్యం అవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్లలేకపోయామని ఆవేదన చెందారు. ఇంత ఆలస్యం అవడానికి అసలు కారణం ఏమిటంటే…. ఒక ఎలుక.

ఉదయం ఎలుక ఒకటి విమానంలోకి చొరబడినట్టు సిబ్బంది గుర్తించారు. దాంతో ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ఎలుకను పట్టడానికి, అది అప్పటికే ఏమైనా వైర్లకు నష్టం చేకూర్చిందా అన్నది పరిశీలన చేయడానికి దాదాపు 11 గంటలు పట్టింది. ఈ భారీ ఆలస్యాన్ని భరించలేక అప్పటికే 50 మంది ప్రయాణికులు ప్రయాణం రద్దు చేసుకుని వెనక్కు వెళ్లిపోయారు.