గవర్నర్‌ పదవికే ఎసరుతెచ్చిన చండ”శేష”నుడు

అప్పటి వరకు దేశంలో ఎన్నికల సంఘం తన బలం తెలియని హనుమంతుడిగా కాలాన్ని వెళ్లదీసింది. ఎన్నికల కమిషన్ కేవలం ఫలితాలు ప్రకటించే మెసెంజర్‌గా మాత్రమే ప్రజలకు తెలుసు. అసలు ఎన్నికల కమిషన్‌ను చూసి రాజకీయ పార్టీలు భయపడింది లేదు… మర్యాద ఇచ్చింది కూడా లేదు. అప్పటి వరకు పనిచేసిన ఎన్నికల సంఘం అధికారులు కూడా తమ హక్కులు, అధికారాలకు సంబంధించిన పుస్తకాలను తిరగేసే ప్రయత్నం చేయలేదు.

కానీ 1990 డిసెంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా ఒకరొచ్చారు. ఎన్నికల సంఘం అంటే ఆ రోజు మొదలైన భయం ఇప్పటికీ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది.

1990 డిసెంబర్‌ 12న సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన టీఎన్‌ శేషన్‌ … ఆరేళ్ల కాలంలో ఎన్నికల సంఘం సత్తా ఏంటో చూపించాడు. ఎన్నికల కమిషన్‌కు కోరలు అమర్చాడు. అప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇష్టానికి వ్యవహరించిన రాజకీయ పార్టీలు శేషన్ సంస్కరణలతో హడలిపోయాయి.

కొత్త అనుభవాలను జీర్ణించుకోవడానికి రాజకీయ పార్టీలకు చాలా కాలమే పట్టింది. అప్పట్లో రిగ్గింగ్ అంటే కొన్ని ప్రాంతంలో కామన్. కొన్ని వర్గాలు అసలు ఓటింగ్‌కే వచ్చేవి కాదు. అలాంటి ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరింపచేశాడు శేషన్. దాంతో ప్రజలు ధైర్యంగా ఓటేశారు. 1991లో దేశంలో మతఘర్షణలు, గందరగోళ పరిస్థితుల నడుమ కూడా భారీగా పోలింగ్ కేవలం శేషన్ సంస్కరణ వల్లే సాధ్యమైందని చెబుతుంటారు.

ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది కూడా శేషనే. కేరళకు చెందిన శేషన్‌ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా నియమితులైన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా నీళ్లు నమిలాయి. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం శేషన్‌ లొంగక పోవడంతో అధికార పార్టీ వారు కూడా ఎందుకు తెచ్చి పెట్టుకున్నామా అని లోలోన రగిలిపోయారు. అయినా సరే శేషన్ తన పని తాను చేసుకుపోయారు. ఎన్నికల్లో ఖర్చుపై ఆంక్షలు తీసుకొచ్చారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారు. రాత్రి 10 తర్వాత ప్రచారంపై వేటు వేశారు.

శేషన్‌ దెబ్బకు పెద్దపెద్ద వారు కూడా హడలిపోయారు. గవర్నర్ ఒకరు పదవి పొగొట్టుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడి తరపున గవర్నర్ ఒకరు ప్రచారానికి వచ్చారు. దాంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికనే వాయిదా వేయించారు శేషన్. దాంతో చివరకు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో ఒక మంత్రి ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా వేదిక ఎక్కి ప్రసంగిస్తుంటే నేరుగా వెళ్లి అతడిని కిందకు పంపించారు శేషన్.

రాజకీయ పార్టీలతో ఎన్నికల సమయంలో అధికారులు అంటకాగడం అప్పటి వరకు సహజమే. శేషన్ హయాంలో అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తూ వచ్చారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ పీవీ కేబినెట్‌లోని కేంద్రమంత్రులు సీతారాం కేసరి, కల్పనాథ్‌ రాయ్‌లను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రధానికి శేషన్ చేసిన సూచన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో శేషన్ హద్దులు మీరుతున్నారంటూ రాజకీయ వ్యవస్థ ఒంటికాలిపై మీదకు వచ్చినా శేషన్ లెక్కచేయలేదు.

1996 డిసెంబర్‌ 11న పదవీ విరమణ చేసిన టీఎన్‌ శేషన్ ఆ తర్వాత 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. కేఆర్‌ నారాయణ చేతిలో ఓడిపోయారు. పుట్టపర్తి సత్యసాయి బాబాకు శేషన్ భక్తుడు. చెన్నైలో ఉంటున్న టీఎన్‌ శేషన్‌… వృద్ధాప్య సమస్యలతో ఆదివారం రాత్రి సొంత నివాసంలోనే కన్నుమూశారు.