తెలుగుకొచ్చిన ముప్పేమీ లేదు… తెలుగు మీడియం కూడా ఉండాలని సీఎంను కోరుతా…

ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు భాషకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ప్రభుత్వం తెచ్చిన జీవో తెలుగు భాషకు గొడ్డలి పెట్టు అన్న వాదనతో తాను ఏకీభవించడం లేదన్నారు.

ప్రస్తుతం ధనిక విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ చదువు అందుబాటులో ఉంటోందని… ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ చదువుల కారణంగా పేదవారు, వెనుక బడిన వర్గాల విద్యార్థులకూ పోటీ ప్రపంచంలో నెట్టుకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే జగన్‌ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంపై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధిస్తేనే మంచిదని అభిప్రాయపడుతూనే… ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పటికీ తెలుగు సబ్జెట్‌ను తప్పనిసరి చేశారు కాబట్టి తెలుగు భాషకు వచ్చే ముప్పేమీ ఉండదన్నారు.

తాను తెలుగు భాష అభిమానినే అని అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తెలుగు మీడియం కూడా ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరుతానని యార్లగడ్డ చెప్పారు.

అలా చేస్తే తెలుగు మీడియంలో చేరాలనుకునే వారు చేరుతారన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి స్కూల్‌ లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాల్సిందిగా తాను గతంలో ఆందోళన చేశానని… ఇప్పుడు ప్రభుత్వం తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేసినందున తెలుగు భాషకు ఇబ్బంది ఉండదన్నారు.