శివసేనకు షాకిచ్చిన బీజేపీ… మహారాష్ట్రలో గవర్నర్ పాలన…

అనుకున్నట్టే అయ్యింది. ఎన్నికల్లో కలిసి పోటీచేసి ఇప్పుడు గెలిచాక దూరం జరిగిన శివసేనకు బీజేపీ గట్టి షాకే ఇచ్చింది. ఏకంగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు పొత్తుల విభేదాలతో ఎవరికీ సాధ్యం కాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు రెడీ అయ్యింది.

తాజాగా మహారాష్ట్ర గవర్నర్ ఇప్పటికే బీజేపీకి, శివసేనకు ఆ తర్వాత ఎన్సీపీకి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపారు. కానీ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో.. ఇక చేసేదేం లేక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర గవర్నర్ సిఫారసు చేస్తూ మంగళవారం కేంద్రానికి లేఖ పంపారు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్సీపీకి సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు గవర్నర్ సమయం ఇచ్చారు. కానీ ఆ పార్టీకి పూర్తి స్థాయిలో సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. గడువు ముగియడం.. ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి తాజాగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి నివేదిక పంపించారు.

అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అడ్డంకిగా మారింది. శివసేన-ఎన్సీపీ కలవడానికి రెడీ అయినా బీజేపీ మిత్రుడు, మతతత్వ శివసేనతో కలవడానికి కాంగ్రెస్ ససేమిరా అంటోంది. మంగళవారం కాంగ్రెస్ కీలక నేతలు ముంబైలో దిగి పొత్తు కుదుర్చడానికి రెడీ అవ్వగానే బీజేపీ చక్రం తిప్పింది. వెంటనే ఈ పొత్తును విచ్చిన్నం చేయడానికి గవర్నర్ తో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీంతో మహారాష్ట్రలో ఇక రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయి.