పరిష్కారమైన సమస్యపై…. దీక్ష ఎలా?

చంద్రబాబునాయుడు ఒక కార్యక్రమం తలపెట్టారు అంటే… అందుకు వారం పది రోజుల ముందే పత్రికలు బ్యాగ్రౌండ్‌ వర్క్ మొదలుపెడతాయి. చంద్రబాబు పోరాటం చేయబోయే అంశంపై వరుసగా కథనాలు రాస్తాయి. ఏదో అయిపోతోంది అందువల్లే సదరు సమస్యపై చంద్రబాబు పోరు బాట పట్టారని…. జనానికి నిత్యం ఎక్కించే ప్రయత్నం చేస్తాయి.

కానీ గురువారం చంద్రబాబు తలపెట్టిన ఇసుక దీక్ష విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇసుక కొరతకు కారణం ప్రభుత్వమే అని చంద్రబాబు దీక్షకు దిగుతుండగా పరిస్థితి అనుకూలిస్తున్నట్టు కనిపించడం లేదు.

వరదలు తగ్గిపోవడంతో ఇప్పుడు ఇసుక లభ్యత అమాంతం పెరిగింది. దానికి తోడు ప్రస్తుతం బాబు పత్రికలతో సహా మీడియా అంతా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లోకి ఇంగ్లీష్‌ అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉంది. దాంతో ఎల్లుండి జరిగే బాబు దీక్షకు అనుకున్నంత ఊపు రావడం లేదు.

గతంలో అయితే చంద్రబాబు దీక్ష అంటే వారం నుంచే దీక్ష వాతావరణం మీడియాలో కనిపించేది. ఇప్పుడంతా ఫోకస్ ఇంగ్లీష్ మీడియంపై ఉండడంతో చంద్రబాబు దీక్షకు ప్రచారం లేదు. చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన దీక్షను విజయవంతం చేయాల్సిందేనని పార్టీ నేతలను పురమాయిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇచ్చినందున జనసేన మద్దతు ఖాయం. అయితే తన దీక్షకు సంఘీభావం తెలిపేలా నేరుగా పవన్‌ కల్యాణ్‌ను రప్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పవన్‌ వద్దకు బృందాన్ని పంపుతున్నారు.

ఇటీవల సుజనా చౌదరితో కలిసి తిరుగుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వద్దకు ఆలపాటి రాజాను పంపించి మద్దతు కోరారు. ఇసుక పోరాటానికి మద్దతు తెలిపిన కన్నా లక్ష్మీనారాయణ… పార్టీ లైన్‌ కారణంగా నేరుగా దీక్షా శిబిరానికి వచ్చేందుకు వీలు కాదని వివరించి పంపించారు.

ఇలా ఒక వైపు వివిధ పార్టీల నుంచి మద్దతు కూడగడుతూనే దీక్ష అవసరాన్ని ప్రజలకు వివరించేలా మీడియా ద్వారా కథనాలు విస్త్రృతం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్టు చెబుతున్నారు. జాతీయ మీడియాలో మరోసారి సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు.

గురువారమే దీక్ష కాబట్టి నేడు రేపు మీడియా సంస్థలు కూడా ఇంగ్లీష్‌పై దాడిని తగ్గించి … దీక్ష అంశానికి కవరేజ్‌ పెంచే అవకాశం ఉంది. ఇసుక వల్ల ఇప్పటి వరకు కార్మికులు పడ్డ ఇబ్బందులను మరోసారి గుర్తు చేసేలా చంద్రబాబు దీక్ష సందర్భంగా భారీ కథనాలు ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు పత్రికలు, టీవీ చానళ్లు సిద్దమవుతున్నాయి. కాకపోతే నదుల్లో వరద తగ్గడం ఇసుక సరఫరా భారీగా పెరగడం టీడీపీ నేతలను నిరాశకు గురి చేస్తోంది. చంద్రబాబు దీక్ష ఆలస్యం అయిందా అన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.