జోకోకు షాక్, ఫెదరర్ ఆశలు సజీవం

  • ఏటీపీ టూర్ సెమీస్ లో డోమనిక్ థైమ్

2019 పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ టూర్ ఫైనల్స్ గ్రూపు లీగ్ లో సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది.

రౌండ్ రాబిన్ లీగ్ తొలి రౌండ్ మ్యాచ్ ల్లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నడాల్, మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ పరాజయాలు పొందితే… రెండోరౌండ్ మ్యాచ్ లో…రెండో ర్యాంకర్ నొవాక్ జోకోవిచ్ కు… ఆస్ట్ర్రియా ఆటగాడు డోమనిక్ థైమ్ షాకిచ్చాడు.

లండన్ వేదికగా జరుగుతున్న ఎనిమిది మంది టాప్ ర్యాంక్ ఆటగాళ్ల ఈ సమరంలో సెమీస్ చేరిన తొలి ఆటగాడి ఘనతను డోమనిక్ థైమ్ సొంతం చేసుకోగలిగాడు.

జోర్న్ బోర్గ్ గ్రూప్ రెండో రౌండ్ పోటీలో…5వ సీడ్ డోమనిక్ థైమ్ మూడుసెట్ల సమరంలో రెండో సీడ్ జోకోవిచ్ ను 6-7, 6-3, 7-6తో అధిగమించి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

తొలిరౌండ్లో ఫెదరర్ ను కంగు తినిపించిన థైమ్..చివరకు జోకోవిచ్ ను సైతం ఓడించడం ద్వారా తన సత్తా చాటుకొన్నాడు.

ఫెదరర్ తొలిగెలుపు… 

ఇదే గ్రూపులో భాగంగా జరిగిన రెండో రౌండ్ పోటీలో ఆరుసార్లు విన్నర్ రోజర్ ఫెదరర్ 7-6, 6-3తో ఇటలీ ఆటగాడు మాటియో బెర్టినినీ పై విజయం సాధించాడు.

గ్రూపు ఆఖరి రౌండ్ పోటీలో ఫెదరర్- జోకోవిచ్ ల మ్యాచ్ లో నెగ్గిన ఆటగాడు సెమీస్ చేరగలుగుతాడు.

ఆండీ అగాసీ గ్రూపులో భాగంగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలలో నడాల్ పైన అలెగ్జాండర్ జ్వెరేవ్, మెద్వదేవ్ పై స్టెఫానోస్ సిటిస్ పాస్ విజయాలు సాధించారు.