ఈ ప్రశ్నలకు భయపడే పవన్‌ వెళ్లిపోయారా ?

మంగళవారం విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాను చాలా ధైర్యవంతుడిని అని, ఎవరికీ భయపడే వాడిని కాదని… విజయవాడ రోడ్లపై గొడవలకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు. తానేమీ సరదాపడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని… కావాలంటే తనను విమర్శిస్తున్న వారు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేస్తే సహించబోమన్నారు. ఇన్ని చెప్పిన పవన్‌ కల్యాణ్ ఆఖరిలో విలేకర్లు పలు ప్రశ్నలు అడిగేందుకు సిద్దమవుతుండగానే…. హఠాత్తుగా లేచి హడావుడిగా వెళ్లిపోయారు.

ఇలా వెళ్లిపోవడాన్ని… మంత్రి పేర్ని నాని కూడా ప్రశ్నించారు. విలేకర్ల ప్రశ్నలకు బదులివ్వకుండా ఎందుకు వెళ్లిపోయారని నిలదీశారు. అయితే పవన్ ఇలా వెళ్లిపోవడానికి…. కొన్ని సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు ఎదురువుతాయని ముందే ఊహించడమే కారణమని చెబుతున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి జగన్‌…. పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని ప్రశ్నించలేదు. మీ ముగ్గురు భార్యల సంతానం అయిన నలుగురు పిల్లలు ఏ స్కూళ్లలో ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మీడియా సమావేశంలో విలేకర్లకు ప్రశ్నలు అడిగే చాన్స్ ఇస్తే … మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అని ప్రశ్నించే అవకాశం ఉందని… దానికి తప్పనిసరిగా ఎల్‌కేజీ నుంచే ఇంగ్లీష్‌ మీడియంలో తన పిల్లలు చదువుతున్నారని చెప్పాల్సి వస్తుందని.. అలా చెబితే… ”మరి మీరెందుకు మీ పిల్లలను తెలుగు మీడియంలో చదివించడం లేదని” విలేకర్లు అడిగితే పరువు పోతుందన్న ఉద్దేశంతోనే ఆ అవకాశం ఇవ్వకుండా పవన్‌ వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.

”ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే విజ్ఞానం పెరుగుతుందని మీరు, రామోజీరావు, చంద్రబాబు, వెంకయ్యనాయుడు చెబుతున్నారు కదా… మరి మీ పిల్లలను విజ్ఞానం కోసం ఒకటి నుంచి కనీసం ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో ఎందుకు చేర్పించలేదు” అని విలేకర్లు అడిగే అవకాశం ఉండేది. కానీ పవన్ కల్యాణ్ తెలివిగా ఆ చాన్స్ ఇవ్వలేదు.

వెంకయ్యనాయుడు లాంటి గొప్ప వ్యక్తిని విమర్శిస్తారా? అని ముఖ్యమంత్రిని పవన్‌ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కానీ 2014కు ముందు వెంకయ్యనాయుడిని పవన్ కల్యాణ్ తిట్టినన్ని తిట్లు మరొకరు తిట్టలేదు.

”మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు” అని వెంకయ్యనాయుడిని జగన్‌ మోహన్ రెడ్డి ప్రశ్నించడమే తప్పు అయితే… ”మరి ఎన్నికల ముందు వెంకయ్యనాయుడిని ఇష్టమొచ్చినట్టు మీరెందుకు తిట్టారు” అని విలేకర్లు ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావించే పవన్ కల్యాణ్ వెళ్లిపోయినట్టు చెప్పుకుంటున్నారు.

గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాను నడిపిన అచ్చెన్నాయుడితో కలిసి లాంగ్‌ మార్చ్‌ చేయడాన్ని కూడా విలేకర్లు ప్రశ్నించే అవకాశం ఉండేది.

కాబట్టి విలేకర్లకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే తాను చెప్పాల్సింది చెప్పేసి పవన్‌ కల్యాణ్ ప్రెస్‌మీట్‌ నుంచి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.