పవన్‌ నాయుడు… మీరు ఒకసారి తాట తీస్తే… మేం 10సార్లు తాట వలుస్తాం… జగన్‌ను శివుడితో పోల్చావ్… అందుకు థ్యాంక్స్‌

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనుల్లో ఒక్క మంచి పని కూడా జనసేన అధ్యక్షుడు పవన్‌ నాయుడికి కనిపించడం లేదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఒక్క ఇసుక అంశాన్ని మాత్రమే పట్టుకుని లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ నాయుడి తీరు చాలా దుర్మార్గంగా ఉందన్నారు.

పవన్‌ నాయుడు మీడియా ముందుకు వచ్చి తానో సంస్కారవంతుడిని అని చెప్పుకుంటున్నారని… పవన్‌ కల్యాణ్‌కు వారి అమ్మగారు ఏరోజుకు ఆరోజు సంస్కారం నేర్పుతారా అని నిలదీశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్‌మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో తిట్టడం తప్ప… పవన్ నాయుడు ఏమైనా చేశారా అని నిలదీశారు. అదేనా అమ్మానాన్నలు నేర్పిన సంస్కారం అని ప్రశ్నించారు.

సినిమాల్లో హీరో ఏం చేసినా, ఎన్ని తిట్టినా అవతలి వారు ఎదురు చెప్పరని… రాజకీయాల్లో కూడా అలాగే ఉంటుందని అనుకున్నారా అని ప్రశ్నించారు. తాటా తీస్తా అని పదేపదే పవన్‌ నాయుడు అంటున్నారని… పవన్‌ నాయుడు ఒకసారి తాటతీస్తే… రాజకీయాల్లో అవతలి వారు పది సార్లు తాట వలుస్తారని పేర్ని నాని హెచ్చరించారు.

పెళ్లిళ్ల మీద మక్కువ ఉంది కాబట్టి పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని… అదే మక్కువ అందరికీ ఉండదని పేర్నినాని వ్యాఖ్యానించారు. జనసేన పెట్టినప్పటి నుంచి పవన్‌ మాట్లాడినన్ని  సంస్కారం లేని మాటలు మరెవ్వరూ మాట్లాడలేదన్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై విమర్శలు చేయడం ఏమిటని పవన్‌ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారని… కానీ గతంలో ఇదే పవన్ కల్యాణ్‌… వెంకయ్యనాయుడిని తిట్టినట్టుగా మరెవ్వరూ తిట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ తానొక్కడినే ధైర్యవంతుడిని అని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రెస్‌మీట్‌లో ఇవన్నీ ఎవరైనా అడుగుతారేమో అని మాట్లాడేసి త్వరత్వరగా లేచిపోయారని ఎద్దేవా చేశారు. ఎస్సీఎస్టీ బీసీ, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లేక ఇబ్బంది పడుతున్నారని… పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని వారు కోరడం వల్లే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై నిర్ణయం తీసుకుందన్నారు. దానికి పవన్‌ నాయుడు ఎందుకు అంతగా బాధపడుతున్నారో అర్థం రావడం లేదన్నారు.

ప్రభుత్వ భాషల్లో తెలుగు భాషను తీసివేయడం లేదని… తెలుగు సబ్జెక్ట్‌ను ఖచ్చితంగా చదివేలా చేశామన్నారు. వైసీపీ 151 ఎమ్మెల్యేలు శివుడి మెడలో ఉన్నామని విర్రవీగవద్దు నేల మీదకు దిగాల్సి వస్తుందన్నారని… ఎమ్మెల్యేలను పాములు అన్నా సరే జగన్‌మోహన్ రెడ్డిని శివుడితో పోల్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

పవన్ నాయుడు ఏమో జగన్‌మోహన్ రెడ్డిని మ్యాన్‌ ఫ్రైడే అనవచ్చు… మేం మాత్రం ”మ్యాన్‌ విత్ త్రీ ఉమెన్‌” అనకూడదా అని ప్రశ్నించారు. విజయవాడ రోడ్ల మీద తేల్చుకునేందుకు సిద్దమని పవన్‌ కల్యాణ్ అంటున్నారని… గతంలో ఢిల్లీకి రండి తేల్చుకుందామని అన్నారని.. అప్పుడు తాము ఢిల్లీ వెళ్తే పవన్‌ కల్యాన్‌ మాత్రం అడ్రస్‌ లేరన్నారు.

ఐదు నెలలకే పెట్టుబడులు రాలేదంటున్న పవన్‌ నాయుడు… మరి చంద్రబాబునాయుడు పాలనలో ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయో లిస్ట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదని పవన్ కల్యాణ్ అంటున్నారని… భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న చరిత్ర మాత్రం తమకు తెలియదన్నారు.

పవన్‌ కల్యాణ్ కుమారుడేమో ఓక్రిడ్జ్ ఇంగ్లీష్‌ స్కూల్‌లో చదువుకోవాలి… సామాన్యుల పిల్లలు మాత్రం తెలుగులోనే చదువుకుని, ఇంగ్లీష్ నేర్చుకోకుండా వెనకబడిపోవాలా అని నిలదీశారు. పదేపదే తాను ధైర్యవంతుడిని అని పవన్‌ నాయుడు చెప్పుకుంటున్నారని… కానీ తానొక్కడే ధైర్యవంతుడు అని అనుకోవడం పొరపాటు అన్నారు. వైసీపీలో టన్నులుటన్నుల ధైర్యం ఉన్న నాయకత్వం ఉందని… ఆ విషయం ఇప్పటికే రుజువైందన్నారు.

‘అమరావతి ఆంధ్రుల రాజధాని కాదు… చంద్రబాబు చుట్టాల రాజధాని’ అని కర్నూలులో ఎన్నికల ప్రసంగం చేసింది పవన్ కాదా అని నిలదీశారు. ఓట్ల కోసం కర్నూలు వెళ్లినప్పుడు కర్నూలు రాజధాని ఉండాలని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని ఎందుకు కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు.

వెంకటేశ్వరస్వామి సుప్రభాతం కూడా ఇంగ్లీష్‌లో పెట్టుకోండి అనే స్థాయికి పవన్ నాయుడు దిగజారిపోయారన్నారు. అసలు వెంకటేశ్వరస్వామి సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో పవన్‌ కల్యాణ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. ఇలాంటి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూనే… తిరిగి తనకు తానే సంస్కారవంతుడిని అని సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు వాయిదాలు పవన్‌ నాయుడికి కూడా కొత్తేమీ కాదు కదా అని పేర్నినాని నిలదీశారు.

భవన కార్మికులకు సంబంధించిన సంక్షేమ నిధి 12 వందల కోట్లను చంద్రబాబు, అచ్చెన్నాయుడు వాడేసుకుంటే… అదే అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకుని విశాఖలో లాంగ్‌ మార్చ్ లో కార్మికుల గురించి ఎలా మాట్లాడారని నిలదీశారు. ఒక్క రోజైనా ఈ అంశంపై చంద్రబాబును పవన్ నాయుడు ప్రశ్నించారా అని నిలదీశారు. ఖాళీగా ఉంటూ రోజూ పాతిక ముప్పై ట్వీట్లు చేస్తున్న పవన్‌ నాయుడు ఒక్కసారైనా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మెచ్చుకున్నారా అని నిలదీశారు.