సుప్రీం కోర్ట్‌ మరో సంచలన తీర్పు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇస్తున్న తీర్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఏ సుప్రీం జడ్జి కూడా సాహసించని కేసులను టేకప్ చేసి తీర్పులు ఇస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు.

సుప్రీం చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ హయాంలోనే కశ్మీర్ విభజన, త్రిపుల్ తలాక్ బిల్లులపై వ్యాజ్యాలు నడిచాయి. ఇక దేశంలో హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలకు, వివాదాలకు కేంద్ర బిందువైన ‘అయోధ్య’ వివాదంపై కూడా దిగిపోతూ చీఫ్ జస్టిస్ గొగోయ్ తమ తీర్పునిచ్చారు.

తాజాగా మరో సంచలన తీర్పును ఈరోజు సుప్రీం కోర్టు వెలువరించింది.

భారత న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చారిత్రక ఆదేశాలు జారీ చేశారు. సీజేఐ సంస్థ కూడా ప్రభుత్వ సంస్థేనని.. అది కూడా పారదర్శకత పాటించాలని, ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

2010లో సుప్రీం కోర్టు ప్రధాన భారత న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో వాజ్యం దాఖలైంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్, కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తాజాగా ఈ పిటీషన్లపై విచారణ జరిపి ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టును తీసుకొస్తూ సంచలన తీర్పును వెలువరించింది.