బంగ్లాదేశ్ పై టెస్టుల్లో అజేయ భారత్

  • ఇండోర్ లో నేటినుంచే బంగ్లాతో తొలిటెస్ట్
  • 9 టెస్టుల్లో 7 విజయాల భారత్

టాప్ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కేవలం 18 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ అనుబంధం మాత్రమే ఉంది. భారత గడ్డపైనే టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన బంగ్లాదేశ్ ఇప్పటి వరకూ భారత్ ప్రత్యర్థిగా ఒక్క గెలుపూ సాధించలేకపోయింది.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…ఈ రెండుజట్లూ రెండుమ్యాచ్ ల సిరీస్ లో ఢీ కొనబోతున్నాయి. తొలి టెస్ట్ మ్యాచ్ ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది.

2000 సీజన్లో తొలిటెస్ట్ మ్యాచ్…

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2000 సంవత్సరం సీజన్లో భారత్ ప్రత్యర్థిగా జరిగిన టెస్ట్ తో బంగ్లాదేశ్ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టింది.

ఆ మ్యాచ్ లో భారతజట్టుకు సౌరవ్ గంగూలీ, బంగ్లాజట్టుకు నైముర్ రెహ్మాన్ నాయకత్వం వహించారు.

ఓపెనర్ శివసుందర్ దాస్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సబా కరీం, జహీర్ ఖాన్ లు…బంగ్లాదేశ్ ప్రత్యర్థిగానే తమ అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ లు ఆడితే…సౌరవ్ గంగూలీ 28 సంవత్సరాల 125 రోజుల వయసులో టెస్ట్ కెప్టెన్ గా తన కెరియర్ మొదలు పెట్టాడు.

తొలిఇన్నింగ్స్ లో భారత్ కు దీటుగా ఆడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులకే పేకమేడలా కూలి 9 వికెట్ల ఓటమి చవిచూసింది.

2004లో ఇన్నింగ్స్ గెలుపు…

2004 సిరీస్ లో భాగంగా ఢాకా వేదికగా ముగిసిన టెస్టులో భారతజట్టు ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ లోనే మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన 34వ టెస్ట్ శతకం సాధిస్తే…ఇర్ఫాన్ పఠాన్ 5 వికెట్లు పడగొట్టాడు.

అదే సిరీస్ లో భాగంగా జరిగిన రెండోటెస్ట్ లో సైతం భారత్ ఇన్నింగ్స్ విజయం నమోదు చేసింది. రాహుల్ ద్రావిడ్ సెంచరీ సాధించడం ద్వారా.. .టెస్టు హోదా పొందిన అన్ని దేశాలపైన శతకాలు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.

2007 సిరీస్ లో భాగంగా ఢాకా వేదికగా ముగిసిన టెస్టులో సైతం భారత్ ఇన్నింగ్స్ 239 పరుగులతో విజయం సొంతం చేసుకోగలిగింది.

హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన 2017 సిరీస్ టెస్ట్ మ్యాచ్ లో సైతం బంగ్లాదేశ్ కు పరాజయం తప్పలేదు. విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ, మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా శతకాలు సాధించడంతో భారత్ 208 పరుగుల భారీతేడాతో విజేతగా నిలిచింది.

భారత్ 7-0 రికార్డు…

2000 నుంచి 2017 సిరీస్ వరకూ రెండుజట్లూ తొమ్మిది టెస్టుల్లో తలపడితే భారత్ 7 విజయాలు, రెండు డ్రాలతో తన ఆధిక్యాన్ని చాటుకొంటూ వస్తోంది.

ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం ప్రపంచ నంబర్ వన్ భారతజట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇండోర్ వేదికగా తొలిటెస్ట్, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనున్నాయి.