న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన కృష్ణం రాజు

టాలీవుడ్ సీనియర్ నటుడు.. 79 ఏళ్ల రెబల్ స్టార్ కృష్ణం రాజు బుధవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కృష్ణం రాజు ఆస్పత్రి పాలు కావడానికి కారణం న్యూమోనియా. ఈ వ్యాధితో ఆయన కొద్దికాలంగా బాధపడుతున్నారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం చలికాలం మొదలు కావడంతో కృష్ణంరాజుకు న్యూమోనియా ఎక్కువైపోయింది. హైదరాబాద్ లో చలికాలం మొదలు కావడంతో ఆయనకు నిన్న రాత్రి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారిందట.. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కృష్ణం రాజును బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కృష్ణం రాజును డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ప్రస్తుతం కృష్ణం రాజు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఆయన సజావుగా ఊపిరి తీసుకుంటుండడంతో ఈరోజు జనరల్ వార్డ్ కు మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమాను కృష్ణం రాజు నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మాతగా సినిమా తీస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ పార్టీలో కృష్ణం రాజు కొనసాగుతున్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు, వయోభారం కారణంగా ఏపీ పాలిటిక్స్ లో చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు.