చివరకు మత రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయావా పవన్ !

జగన్‌ పరిస్థితి అటు ఇటు అయితే… పరిస్థితి ఏంటో ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని పవన్ అంటున్నారని… అటు ఇటు అంటే చంద్రబాబుతో కలిసి ఏం చేయాలనుకుంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు అంబటి రాంబాబు. నేరాలు చేసిన వ్యక్తి న్యాయమూర్తి ముందే కావాలంటే నీవు కూడా నేరాలు చేసుకో అన్నట్టుగా పవన్‌ తీరు ఉందన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు అంటే … మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని పిలుపునివ్వడం ఏ నాయకత్వ లక్షణం అని ప్రశ్నించారు.

అన్న క్యాంటీన్లు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తీసుకొచ్చి ఇప్పుడు అవి లేకపోవడంతో పేదలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు చెబుతుండడం విచిత్రంగా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులు 50 మంది ఎక్కడ చనిపోయారని ప్రశ్నించారు. బహిరంగంగా శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

వెనుకబడిన వర్గాలంటే వైఎస్‌ కుటుంబానికి నచ్చదని అందుకే ఇసుక కొరత సృష్టించారంటూ చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలు జగన్‌ వైపు ఉన్నాయి కాబట్టే మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పదేపదే మత ప్రస్తావనలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు లేని ఈ మత విమర్శ ఇప్పుడు మాత్రమే పవన్‌, చంద్రబాబు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.

చివరకు జగన్‌ ప్రసాదం తింటారా లేదా అని విమర్శించే స్థాయికి పవన కల్యాణ్ దిగజారిపోయారన్నారు. దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్ పదేపదే తాను పాలసీ గురించి మాత్రమే మాట్లాడుతానని చెప్పుకుంటూనే … వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తాట తీస్తా, చెవుల నుంచి నెత్తురు వచ్చేలా మాట్లాడుతా వంటి వ్యాఖ్యలు పాలసీలపై మాట్లాడడం అవుతుందా అని నిలదీశారు.

ప్యాకేజీ కోసం ఎగేసుకుని మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్… ముందు సొంత పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. తెనాలి బాబు, లింగమనేని బాబులు … పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ప్యాకేజీలు ఇప్పించిన అంశం ఎవరికి తెలియదు అని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎవరికి చెబితే వారికే జనసేన టికెట్లు ఇచ్చారన్న అంశాన్ని జనసేన నేతలే చెబుతున్నారన్నారు.

సొంత డబ్బుతో పెట్రోల్‌ కొట్టించుకుని బండి నడిపితే ఆనందంగా ఉంటుంది గానీ… చంద్రబాబు డబ్బుతో పెట్రోల్ కొట్టించుకుని పార్టీ నడిపితే దాని వల్ల ఉపయోగం ఉండదన్నారు. సొంత పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి… పేద ప్రజలు తెలుగులో మాత్రమే చదువుకోవాలనడం సరికాదన్నారు. 23 మందుపాతరలు పెట్టినా భయపడలేదని చెప్పుకుంటున్న చంద్రబాబు… మరి ఓటుకు నోటు కేసుతో ఒక దెబ్బకు కరకట్టపై వచ్చి ఎందుకు పడ్డారని ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ను తన దూతగా చంద్రబాబే ఢిల్లీకి పంపించి ఉండవచ్చన్నారు. పవన్‌ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు నేరుగా బీజేపీ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి… పవన్‌ కల్యాణ్‌ను దూతగా పంపించి ఉంటారన్నారు.

చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తే మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అని టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా తెలిసిపోయిందని అందుకే వారు దీక్షకు రాలేదని అభిప్రాయపడ్డారు.