ప్రపంచ ఫుట్ బాల్ లో భారత్ మరో డ్రా

  • 1-1తో అఫ్ఘన్ ను నిలువరించిన భారత్

2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియా జోన్ గ్రూప్-ఈ అర్హత రౌండ్ రాబిన్ లీగ్ లో 106వ ర్యాంకర్ భారత్ మరోసారి ఓటమి నుంచి బయటపడి డ్రాతో ఊపిరి పీల్చుకొంది.

తజకిస్థాన్ లోని దుషాంబే సెంట్రల్ రిపబ్లికన్ స్టేడియం వేదికగా 149వ ర్యాంకర్ అప్ఘనిస్తాన్ తో ముగిసిన పోటీని భారత్ ఆఖరి నిముషం గోలుతో డ్రాగా ముగించగలిగింది.

తొమ్మిది డిగ్రీల శీతల వాతావరణంలో సాగిన ఈ కీలక సమరం మొదటి భాగంలోనే అప్ఘన్ మెరుపుగోలుతో భారత్ ను ఆత్మరక్షణలో పడవేసింది.

ఆట 45వ నిముషంలో జల్ ఫగార్ నజరే సాధించిన గోలుతో అప్ఘన్ 1-0తో పైచేయి సాధించింది. ఆ తర్వాత నుంచి భారత జట్టు ఈక్వలైజర్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.

పదపదే ఆటగాళ్లను మార్చుతూ వచ్చిన భారత కోచ్ …చివరకు ఆఖరి ప్రయత్నంగా సిమెనిన్ దుంగల్ ను సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దించడం ద్వారా..సఫలం కాగలిగారు.

ఆట మరికొద్ది క్షణాలలో ముగుస్తుందనగా సిమెనిన్ సాధించిన సూపర్ గోల్ తో భారత్ మ్యాచ్ ను 1-1తో సమం చేయగలిగింది.
దీంతో రెండుజట్లూ చెరో పాయింటు పంచుకోవాల్సి వచ్చింది.

ఇప్పటి వరకూ నాలుగురౌండ్ల మ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇది మూడో డ్రా కావడం విశేషం. మొత్తం 3 పాయింట్లతో గ్రూపు ఆఖరిస్థానంలో భారత్ కొనసాగుతోంది.

గతంలో కాంబోడియా, బంగ్లాదేశ్ లాంటి జట్లను ఓడించడమే కాదు…తజకిస్థాన్, జోర్డాన్ జట్లతో జరిగిన మ్యాచ్ లను డ్రాగా ముగించిన అప్ఘన్ జట్టు…చివరకు తనకంటే ఎంతో బలమైన భారత్ ను సైతం 1-1తో నిలువరించడం ద్వారా మొత్తం నాలుగు పాయింట్లతో తన సత్తా చాటుకోగలిగింది.

మరోవైపు ఒమాన్ చేతిలో 1-2తో ఓడిన భారత్…ఖతర్, బంగ్లాదేశ్, అప్ఘన్ జట్లతో జరిగిన మ్యాచ్ లను డ్రాగా ముగించడం విశేషం.