మహేష్ టీమ్ లో అభద్రతా భావం

టైటిల్ లో సరిలేరు నీకెవ్వరు. కానీ ప్రచారంలో మాత్రం టైటిల్ లో చూపించినంత దమ్ము చూపించలేకపోతోంది యూనిట్. అందుకే ఏకంగా ప్రకటన ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు వినూత్నంగా ప్రచారం చేసే ఐడియాలు, కాన్సెప్టులు ఉంటే చెప్పండంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.

నిజానికి మహేష్ సినిమాకు ఇప్పటివరకు ఈ ప్రాబ్లమ్ రాలేదు. అతడి వద్ద చాలా పెద్ద పీఆర్ టీమ్ ఉంది. అటు దర్శకుడు అనీల్ రావిపూడి వద్ద కూడా పీఆర్ టీమ్ ఉంది. పైగా ప్రచారంలో అనీల్ కు డిఫరెంట్ స్టయిల్ కూడా ఉంది. సరిలేరు నీకెవ్వరు ప్రచారాన్ని అందరికంటే ముందు స్టార్ట్ చేసింది కూడా ఇదే. అయినప్పటికీ ఇప్పుడు కొత్త కాన్సెప్టుల కోసం వెదకడానికి ఓ కారణం ఉంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచింది అలవైకుంఠపురములో సినిమా. కాస్త లేటుగా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటికీ, చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ మూవీ. మరీ ముఖ్యంగా విడుదలైన 2 పాటలు చాలు, ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఇప్పుడు అభద్రతా భావంలో పడింది.

సినిమకు కొత్తగా ప్రచారం కల్పించేందుకు ఇప్పటికే పొలాచ్చిలో కొన్ని ప్రమోషనల్ వీడియోస్ షూట్ చేశారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేశారు. సాంగ్ బిట్స్ కూడా రెడీ చేస్తున్నారు. కానీ ప్రేక్షకుల్ని మరింతగా ఎట్రాక్ట్ చేసేందుకు, వినూత్నమైన పోకడలతో రావాలని అనుకుంటోంది యూనిట్. అల వైకుంఠపురములో సినిమాకు పోటీగా నిలవాలంటే ఈమాత్రం ఉండాల్సిందే. అందుకే ఈ తాపత్రయం.