ఏటీపీ టూర్ ఫైనల్స్ సెమీస్ లో ఫెదరర్

  • డూ ఆర్ డై మ్యాచ్ లో జోకోవిచ్ పై విజయం

2019- ఏటీపీ టూర్ సీజన్ ఫైనల్స్ టోర్నీ సెమీస్ కు ఆరుసార్లు విన్నర్ రోజర్ ఫెదరర్ దూసుకెళ్లాడు. లండన్ వేదికగా జరుగుతున్న ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ రెండు గ్రూపులుగా జరుగుతున్న ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీస్ టోర్నీలో సంచలన విజయాలు నమోదవుతూ వచ్చాయి.

జోర్న్ బోర్గ్ గ్రూపులో డోమనిక్ థీమ్ చేతిలో ఓడి…బెర్టినీపై అలవోక విజయం సాధించడం ద్వారా సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొన్న ఫెదరర్ …నెగ్గితీరాల్సిన ఆఖరిరౌండ్ పోటీలో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ పై వరుస సెట్ల విజయం సాధించాడు.

ఏకపక్షంగా సాగిన కీలక సమరంలో పెదరర్ 6-4, 6-3తో జోకోను చిత్తు చేశాడు.

తన కెరియర్ లో 17వసారి టూర్ ఫైనల్స్ టోర్నీలో పాల్గొన్న ఫెదరర్ కు సెమీస్ చేరడం ఇది 16వసారి కావడం విశేషం. జోకోవిచ్ ప్రత్యర్థిగా తలపడిన గత ఆరుసార్లలో ఫెదరర్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం.

ఆండ్రీ అగాసీ గ్రూపులో టాపర్ గా నిలిచిన ఆటగాడితో ఫెదరర్ సెమీస్ లో తలపడనున్నాడు. డోమనిక్ థైమ్, టిస్టిస్ పాస్ ఇప్పటికే సెమీస్ చేరడం ద్వారా నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించారు.