చుట్టూతిరిగి నాగచైతన్య దగ్గర ఆగాడు

గీతగోవిందం సినిమా తర్వాత పరశురామ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేకపోయాడు. కనీసం ఓ హీరోతో ప్రాజెక్టు కూడా ఎనౌన్స్ చేయలేకపోయాడు. అలా చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్న పరశురాం ఎట్టకేలకు తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకొస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో సినిమా వస్తుంది.

గీతగోవిందం తర్వాత ఓ లైన్ అనుకున్నాడు పరశురామ్. ఆ లైన్ తో ఏకంగా మహేష్ బాబును సంప్రదించాడు. కానీ పరశురామ్ చెప్పిన లైన్ మహేష్ కు నచ్చలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు హీరోల్ని సంప్రదించినప్పటికీ పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. ఒక దశలో మెగా కాంపౌండ్ లోనే ఆయన బన్నీతో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ అది కూడా వర్కవుట్ కాలేదు. మధ్యలో నాగచైతన్యను కూడా పరశురాం కలిసినట్టు వార్తలు వచ్చాయి

అలా చాన్నాళ్లుగా హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసిన పరశురామ్ కు ఎట్టకేలకు చైతూ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో చైతూకు చెప్పిన లైన్ తోనే పరశురాం ఈ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే బయటకు రానుంది. మొత్తానికి వంద కోట్లు వసూలు చేసిన గీతగోవిందం తర్వాత బడా హీరోతో సినిమా చేయాలనుకున్న పరశురామ్ ఆశలకు మరోసారి బ్రేక్ పడింది. మళ్లీ అతడికి ఇలాంటి ఛాన్స్ కొంచెం కష్టమే.