వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్

కిందామీద పడి ఎట్టకేలకు వెంకీ మామకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అవుతుంది. ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు, పైగా శుక్రవారం. అందుకే ఆరోజు సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఈ మేరకు సురేష్ బాబు అంతర్గతంగా ఓ నిర్ణయానికి వచ్చేశారు. 15 రోజుల పాటు పారిస్ టూర్ కు వెళ్లబోతున్నారు సురేష్ బాబు. ఇండియా తిరిగొచ్చిన తర్వాత అధికారికంగా తేదీని ప్రకటిస్తారు.

నిజానికి ఈ సినిమాకు డిసెంబర్ 13 తప్ప మరో తేదీ అందుబాటులో లేదు. 13 కంటే ముందు సినిమా రెడీ అవ్వదు. 13 తర్వాత రిలీజ్ చేద్దామంటే ఖాళీ లేదు. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు ఉండనే ఉన్నాయి. సో.. డిసెంబర్ 13న తప్పనిసరిగా ఈ సినిమాను విడుదల చేయాల్సిందే. లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసుకోవాలి.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి దించాలని సురేష్ బాబు భావించారు. ఈ మేరకు ఆయన ఎంక్వయిరీలు కూడా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు దొరుకుతాయో ఆరా కూడా తీశారు. కానీ మహేష్, బన్నీ సినిమాలు ఆల్రెడీ కర్చీఫ్ వేయడంతో పాటు, మిగిలిన కొన్ని థియేటర్లను రజనీకాంత్ దర్బార్ కోసం కేటాయించడంతో వెంకీమామ వెనక్కి తగ్గక తప్పలేదు. అలా చాలా తేదీల్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా డిసెంబర్ 13ను లాక్ చేశారు.