రాజ్‌భవన్‌కు సీఎం… ప్లకార్డుతో మహిళ… తక్షణ స్పందన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్‌ ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. గంట పాటు అక్కడే గడిపారు. కలిసి భోజనం చేశారు. ఈ సమయంలో రాజ్‌భవన్‌ వెలుపల పద్మావతి అనే మహిళ ప్లకార్డుతో న్యాయం కోసం నిలబడింది. సీఎంగారు న్యాయం చేయండి అంటూ ప్లకార్డుతో నిలబడి ఉన్న మహిళను దూరం నుంచే గమనించిన జగన్‌మోహన్ రెడ్డి తక్షణం స్పందించారు. మహిళను పిలిచి మాట్లాడారు.

తన సోదరి కుమారుడిని హత్య చేశారని… హంతకులు వారికి ఉన్న పలుకుబడితో హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారామె. తక్షణం స్పందించిన జగన్‌మోహన్ రెడ్డి ఈ కేసులో హంతకులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

విజయవాడకు చెందిన పద్మావతి చెల్లెలు కుమారుడు మనోజ్‌ సెప్టెంబర్‌21న హత్యకు గురయ్యాడు. గొంతుకోసి, తలపై బండరాళ్లతో మోది చంపేశారు. అసలు హంతకుల బంధువు ఎస్‌ఐ కావడంతో వారు తప్పించుకుని… కిరాయి మనుషుల పేర్లను కేసులో చేర్చారని పద్మావతి ఆరోపించారు.

పోలీసుల నుంచి సరైన స్పందన లేదని…. అందుకే సీఎం వద్దకు వచ్చానని వివరించారు. తాను ప్లకార్డు పట్టుకుని దూరంగా ఉన్నప్పటికి ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. సీఎం స్పందించిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు.