గుంటూరు తమ్ముళ్ళు సైలెంట్‌….

కృష్ణా జిల్లాలో రాజకీయ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. వల్లభనేని వంశీ రేపిన దుమారం కొనసాగుతోంది. టీడీపీ నాయకులే టార్గెట్‌గా వంశీ మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ నేతలు మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

టీవీ డిస్కషన్‌లో వంశీ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా బాబూ రాజేంద్రప్రసాద్‌ తేరుకున్నట్లు కనిపించడం లేదు. నాలుగు రోజులుగా ఆయన బయటకు రావడం లేదు. కనీసం టీడీపీ నేతలు కూడా ఆయనను పరామర్శించిన దాఖలా కనిపించడం లేదు. వంశీ డైరెక్టు అటాక్‌తో టీడీపీ నేతలు తొలి రోజు సైలెంట్‌ అయిపోయారు. మీడియా ముందుకు ఒక్క నేత కూడా రాలేకపోయారు. చివరకు రెండో రోజు నుంచి అధిష్టానం ఒత్తిడితో బయటకు వచ్చిన టీడీపీ నేతలు ఏదో ఒక వెర్షన్‌ వినిపించారు.

కృష్ణా జిల్లా రాజకీయం ఇలా సాగుతుంటే…. పక్కనే గుంటూరు జిల్లా నేతలు మాత్రం సైలెంట్‌ అయిపోయారు. తెలుగుదేశంలో రగడ సాగుతుంటే గుంటూరు జిల్లా నేతలు ఒక్కరు కూడా స్పందించడం లేదు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టడం లేదు. మీడియా ముందుకు అసలే రావడం లేదు. దీంతో పత్తిపాటికి ఏమైంది అని జిల్లా నేతలు ఆరా తీస్తున్నారు. ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఎక్కడా కనిపించడం లేదు. మొన్న లోకేష్‌ టూర్‌కు డుమ్మా కొట్టిన ఆయన…పార్టీలో ఇంత జరుగుతున్నా ఆయన బయటకు రావడం లేదు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా బయటకు రావడం లేదు. ధూళిపాళ్లతో పాటు యరపతినేని కూడా పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

గుంటూరు టీడీపీలో ఇప్పుడు నక్కా ఆనంద్‌బాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, జీవీ ఆంజనేయులు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన నేతలు సైలెంట్‌ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీరిలో పార్టీలో ఉండేది ఎవరు? పోయేది ఎవరు? అనే చర్చ నడుస్తోంది. బీజేపీ, వైసీపీ గేట్లు తెరిస్తే మిగిలే నేతలు ఎంతమంది అనే లెక్కలు కార్యకర్తలు వేసుకుంటున్నారు.