ఇంగ్లీష్‌కు, మత మార్పిడికి సంబంధం లేదు… రాధాకృష్ణ, కన్నాలకు టీడీపీ కౌంటర్‌

మత మార్పిడిల కోసమే ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంను జగన్‌ ప్రవేశపెడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి ప్రతిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అదే నిజమైతే అమెరికా వెళ్లిన తెలుగువారంతా క్రిస్టియన్లు అయ్యారా? ఇంగ్లీష్ నేర్చుకున్న మీడియా పెద్దల పిల్లలంతా మతం మారేశారా? అంటూ పలువురు నవ్వుకుంటున్నారు.

ఈ అంశం టీడీపీకి బాగా డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు స్పందించారు. ఇంగ్లీష్ వల్ల మత మార్పిడులు జరుగుతాయన్న వాదనను ఖండించారు. ఇంగ్లీష్‌కు మత మార్పిడిలకు సంబంధం లేదని… ఇది వాదనకు నిలబడని వైఖరి అని స్పష్టం చేశారు.

కొందరు కుహన మేధావులు ఇలా మతానికి, ఇంగ్లీష్‌కు లింక్‌ పెడుతున్నారని… దీన్ని తాము ఖండిస్తున్నామని నక్కా ఆనంద బాబు స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని… అదే సమయంలో తెలుగు కూడా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

గురకుల పాఠశాలల్లో టీడీపీ హయాంలోనే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని… జగన్‌ ప్రభుత్వం మాత్రం తానే ఇప్పుడు ఇంగ్లీష్‌ తెచ్చినట్టు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. మున్సిపల్ స్కూళ్లలోనూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని నక్కా ఆనందబాబు గుర్తు చేశారు.