Telugu Global
NEWS

సగం భూమి రాసిస్తేనే పాస్‌ బుక్ ఇస్తా " రైతుతో రెవెన్యూ ఉద్యోగి...

రెవెన్యూ శాఖపై వివిధ మార్గాల్లో ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నా… రెవెన్యూ శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నా… ఆ శాఖ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. సమాజం మొత్తం తమ దయాదాక్షిణ్యాల మీదే నడుస్తోంది అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక వీఆర్‌వో ఏకంగా రైతుకు చెందిన భూమికి పాస్‌బుక్‌, ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు సగం భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పటి వరకు లంచం కోసమే పీక్కుతింటున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఇప్పుడు ఇలా భూమిలో వాటా […]

సగం భూమి రాసిస్తేనే పాస్‌ బుక్ ఇస్తా  రైతుతో రెవెన్యూ ఉద్యోగి...
X

రెవెన్యూ శాఖపై వివిధ మార్గాల్లో ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నా… రెవెన్యూ శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నా… ఆ శాఖ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. సమాజం మొత్తం తమ దయాదాక్షిణ్యాల మీదే నడుస్తోంది అన్నట్టుగా రెచ్చిపోతున్నారు.

అనంతపురం జిల్లాలో ఒక వీఆర్‌వో ఏకంగా రైతుకు చెందిన భూమికి పాస్‌బుక్‌, ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు సగం భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పటి వరకు లంచం కోసమే పీక్కుతింటున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఇప్పుడు ఇలా భూమిలో వాటా అడిగే స్థాయికి వచ్చేశారు.

కదిరికి చెందిన ఆలం నవాజ్‌కు తన పెద్దల నుంచి 1.02 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమికి పాస్‌ బుక్‌ కోసం అనేక సార్లు కదిరి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ పని చేయలేదు. రైతు పాస్‌ బుక్‌ రాకుండా వీఆర్‌వో నరసింహారెడ్డి అడ్డుపడుతున్నాడని బాధితుడు చెబుతున్నాడు. చివరకు భూమిలో సగం రాసిస్తేనే పాస్‌బుక్‌ వచ్చేలా చేస్తానని… ఆన్‌లైన్‌లో ఎక్కేలా చేస్తానని… లేదంటే ఎప్పటికీ భూమి దక్కకుండా చేస్తానని వీఆర్‌వో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.

రెవెన్యూ ఉద్యోగలంతా ఒక్కటే అని… పై అధికారులకు ఫిర్యాదు చేసినా తనకేం కాదని.. దిక్కున్న చోట చెప్పుకో అంటూ రైతుకు వీఆర్‌వో తేల్చిచెప్పాడు. దాంతో రైతు ఆలం నవాజ్‌.. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన భూమిలో వాటా అడుగుతున్నాడని వివరించాడు. దాంతో వెంటనే స్పందించిన కలెక్టర్ స్పందన కార్యక్రమం నుంచే నేరుగా తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. బాధితుడితో మాట్లాడించారు. సంబంధిత అధికారులపై కలెక్టర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం తమాషాలు చేస్తున్నారా?. పాస్‌ బుక్‌ కోసం వస్తే భూమిని సగం రాసివ్వాలని అడుతారా?. తక్షణం రైతుకు పాస్‌ బుక్‌ ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్లో ఎక్కించాలని ఆదేశించారు కలెక్టర్. తిక్కతిక్క వేషాలేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తా” అంటూ కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. పాస్‌ బుక్‌ ఇవ్వాలంటే సగం భూమి రాసివ్వాలని డిమాండ్ చేసిన వీఆర్‌వోపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

First Published:  19 Nov 2019 1:16 AM GMT
Next Story