Telugu Global
National

చంద్రబాబుపై విచారణకు ఏసీబీ కోర్టు అంగీకారం

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబునాయుడికి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న 14 ఏళ్ల క్రితం నాటి కేసులో విచారణకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అప్పట్లో లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు నడుస్తోంది. లక్ష్మీపార్వతి పిటిషన్‌పై ఎప్పటిలాగే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. 14 ఏళ్ల నుంచి కేసు విచారణకు నోచుకోలేదు. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండడానికి వీల్లేదని, ఆరు నెలలకు పైగా ఉన్న స్టేలు […]

చంద్రబాబుపై విచారణకు ఏసీబీ కోర్టు అంగీకారం
X

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబునాయుడికి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న 14 ఏళ్ల క్రితం నాటి కేసులో విచారణకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అప్పట్లో లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు నడుస్తోంది.

లక్ష్మీపార్వతి పిటిషన్‌పై ఎప్పటిలాగే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. 14 ఏళ్ల నుంచి కేసు విచారణకు నోచుకోలేదు. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండడానికి వీల్లేదని, ఆరు నెలలకు పైగా ఉన్న స్టేలు ఆటోమెటిక్‌గా ఎత్తివేసినట్టు భావించాలని ఆ మధ్య సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దాంతో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఉన్న కేసుపై స్టే తొలగిపోయింది.

కేసు విచారణకు సంబంధించి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు… ఈ కేసును విచారిస్తామని లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీచేశారు. ఫిర్యాదుదారుగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది.

సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు పిటిషన్‌ వేశారు.

ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు నాడు తోసిపుచ్చింది. దాంతో చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు.

చంద్రబాబుపై విచారణ చేయడానికి వీల్లేదంటూ నాటి హైకోర్టు న్యాయమూర్తి డీఎస్‌ఆర్‌ వర్మ స్టే ఇచ్చారు. చంద్రబాబు కేసులో ఇచ్చిన స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి న్యాయపోరాటం చేసినా దానికి హైకోర్టు అంగీకరించలేదు. అప్పటి నుంచి చంద్రబాబు స్టే మీద తిరుగుతున్నారు.

కానీ ఇటీవల సుప్రీం కోర్టు స్టేలు ఎత్తివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలతో మళ్లీ కేసు కదిలింది. కాకపోతే న్యాయవ్యవస్థపై అపారమైన పట్టు ఉన్న చంద్రబాబును…. కోర్టు బోను వరకు తీసుకొచ్చే సత్తా వ్యవస్థలకు ఉందా అన్నదే ఇప్పుడు అందరి అనుమానం.

చంద్రబాబు మరోసారి పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా ఉంటారా?, స్టే కోసం వస్తే చంద్రబాబు వినతిని తిరస్కరించగలిగే అవకాశం ఉందా? అన్నది చూడాలి.

First Published:  18 Nov 2019 10:26 PM GMT
Next Story