చంద్రబాబుకు మరో సీనియర్ షాక్ ఇవ్వబోతున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి తన అనుచరులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో తాజాగా కర్నూలు జిల్లాలో సమావేశమైనట్లు సమాచారం.

కేఈ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేఈతోపాటు అతడి సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారట.. వీరు వైసీపీలో చేరడానికి వైసీపీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

సీనియర్ అయిన కేఈకి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని…. వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ఈ నెలాఖరులోపు కేఈ ఫ్యామిలీ వైసీపీలో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. దీంతో ఇక టీడీపీలో ఉంటే బతికి బట్టకట్టమని భావించిన కేఈ పార్టీ మారడానికి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.