ట్రోలింగ్ తట్టుకోలేక బయటపెట్టేశారు

రీమేక్స్ హ్యాండిల్ చేయడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారుతోంది మేకర్స్ కు. రీమేక్ అని బయటకు చెబితే ఒక ప్రాబ్లమ్. చెప్పకపోతే మరో సమస్య. బయటకు చెబితే ఒరిజినల్ సినిమాను చూసేస్తున్నారు. దీనివల్ల హైప్ తగ్గిపోతోంది.

తాజాగా అసురన్ సినిమా విషయంలో ఇలానే జరిగింది. వెంకీ చేస్తున్నాడని తెలియగానే, ఆ తమిళ సినిమాను అంతా చూసేశారు. అలా అని చెప్పకపోతే ట్రోలింగ్ కు గురవ్వాల్సి వస్తోంది.

సుమంత్ సినిమాది ఇదే పరిస్థితి. నిజానికి ఇదొక కన్నడ రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. కానీ ఈ మేటర్ దాచి సినిమాను ప్రకటించారు. ముందుగా రాజశేఖర్ తో అనుకున్నారు. ఎందుకో పని జరగలేదు. తర్వాత సుమంత్ తో సినిమా ప్రకటించారు.

అయితే అప్పట్నుంచి ఇది రీమేక్ అనే విషయాన్ని సోషల్ మీడియాలో జనాలు బయటపెడుతూనే ఉన్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవని, మేకర్స్ కూడా ఆ విషయాన్ని బయటపెట్టేశారు.

కన్నడలో హిట్ అయిన కవలదారు అనే సినిమాకు రీమేక్ గా సుమంత్ తో మూవీ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

అంతేకాదు.. తెలుగులో ఈ సినిమాకు కపటధారి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పోస్టర్ కూడా వదిలారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేసి, సమ్మర్ ఎట్రాక్షన్ గా కపటధారిని విడుదల చేయాలనేది ప్లాన్.