కేసీఆర్ మనవడి స్కూల్ ప్రాజెక్టు కోసం కష్టపడ్డ మంత్రి సత్యవతి

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇప్పుడు తెలంగాణ రారాజు కేసీఆర్ మనవడు.. యువరాజు హిమాన్షు తలుచుకుంటే కూడా అంతే… ఏకంగా ఆయన స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తెలంగాణ మహిళా మంత్రిని ఉపయోగించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తీవ్ర చర్చనీయాంశమైన ఈ తీరును స్వయంగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటో పెట్టడంతో విషయం వెలుగుచూసింది.

మంత్రి కేటీఆర్ కుమారుడు, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు స్కూల్లో ‘బాలల సంక్షేమం’పై ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట. దీంట్లో భాగంగా హిమాన్షు మంత్రి సత్యవతితో కలిసి సైదాబాద్ లోని బాల నేరస్థుల జువైనల్ హోం ను సందర్శించి అక్కడి స్థితిగతులను ఆరాతీశారు. అనంతరం మంత్రి సత్యవతిని ఇంటర్వ్యూ చేశాడు.. ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది.

సీఎం కేసీఆర్ మనవడు ఇలా తన ప్రాజెక్ట్ కోసం ఏకంగా మంత్రిని వాడుకున్న వైనం విమర్శలకు తావిస్తోంది. ఒక పిల్లాడు స్కూలు ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రానికి మంత్రి అయిన సత్యవతి పాల్గొనడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే ఉద్దేశం ఏదైనా మంత్రి సత్యవతి వ్యవహరించిన తీరు.. కేసీఆర్ మనవడి కోసం ఇంటర్వ్యూకు హాజరైన వైనం మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.