కొడాలి నాని, వంశీలను హెచ్చరించిన…. నందమూరి హీరో

టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్న మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనూహ్యంగా నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చి హెచ్చరికలు పంపడం హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబును తిట్టిన నాని, వంశీని నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ ఒక వీడియోలో హెచ్చరించాడు. ఇక్కడెవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదంటూ చైతన్యకృష్ణ తీవ్ర పదజాలం వాడాడు. విధానాలపై విమర్శలు చేస్తే ఫర్వాలేదని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదని టేక్ కేర్ అంటూ వీడియోలో సవాల్ చేశాడు. నందమూరి హీరో పంపిన ఈ హెచ్చరిక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ఘాటు విమర్శల పై నందమూరి హీరో కౌంటర్ ఇచ్చాడు. మా మావయ్య, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలను చూసి చాలా బాధేసిందని చైతన్యకృష్ణ అన్నాడు. వ్యక్తిగత దూషణలకు దిగిన వారిద్దరి వైఖరిని ఎండగట్టాడు.

మా మావయ్య చంద్రబాబు సీట్లు ఇస్తేనే ఈరోజు కొడాలి నాని, వంశీ ఈ స్థాయికి వచ్చారని చైతన్య కృష్ణ గుర్తు చేశారు. 2004, 2009 లో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబట్టే మీరు గెలిచారు…. మీరిద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యే, మంత్రి అయ్యారంటే అది చంద్రబాబు వల్లే అంటూ ఎద్దేవా చేశాడు. చంద్రబాబుపై మాట్లాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చైతన్యకృష్ణ మండిపడ్డాడు.

ఇంకోసారి బూతులు మాట్లాడితే మంచిగుండదు అంటూ…. చైతన్యకృష్ణ వీడియోలో కొడాలి నాని, వంశీలకు హెచ్చరికలు పంపాడు. నోరుందని చెప్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.