తటస్థ వేదికలోనే భారత్-పాక్ డేవిస్ కప్ పోరు

  • కజకిస్థాన్ రాజధానిలో దాయాదుల సమరం

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల డేవిస్ కప్ పోరుకు వేదిక ఏదో తేలిపోయింది. నెలరోజుల సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను …తటస్థ వేదికలో నిర్వహించాలన్న భారత అభ్యర్థన మేరకు… కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ లో నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది.

రోహిత్ రాజ్ పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ఏడుగురు సభ్యుల జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. మహేశ్ భూపతితో సహా పలువురు సీనియర్లు భద్రతా కారణాలతో పాక్ తో మ్యాచ్ కు దూరం కాగా వెటరన్ లియాండర్ పేస్ తో సహా పలువురు యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు.

మరోవైపు పాక్ జట్టులో ఇద్దరు టీనేజ్ ప్లేయర్లకు తొలిసారిగా చోటు కల్పించారు. సీనియర్ ప్లేయర్లు ఖురేషీ, అఖీల్ ఖాన్ జట్టు నుంచి ఉపసంహరించుకోగా..అబ్దుల్ రెహ్మాన్, షోయబ్ ఖాన్ లకు చోటు కల్పించారు.

అంతర్జాతీయ టెన్నిస్ సంఘం ర్యాంకింగ్స్ ప్రకారం..రెహ్మాన్ 446, షోయబ్ ఖాన్ 1004 ర్యాంకర్లుగా ఉన్నారు. ఈ పోటీలో భారత్ సైతం యువఆటగాళ్లతో పోరుకు సిద్దమైనా..హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.