ప్రపంచ సాకర్ అర్హత పోటీలో భారత్ రెండో ఓటమి

  • ఒమన్ తో రెండో అంచెలోనూ భారత్ విఫలం

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆసియాజోన్-ఈ గ్రూపు అర్హత పోటీలలో భారత్ రెండో ఓటమితో జోనల్ రౌండ్ నుంచే నిష్క్రమించే ప్రమాదం కొని తెచ్చుకొంది.

ఒమన్, ఖతర్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో భారత్ 5వ మ్యాచ్ లో పరాజయం చవిచూసింది.

మస్కట్ వేదికగా ముగిసిన రెండో అంచె పోటీలో పవర్ ఫుల్ ఒమన్ జట్టుతో జరిగిన పోటీలో 106వ ర్యాంకర్ భారత్ పోరాడి ఓడింది. ఆట 33వ నిముషంలో ఒమన్ ఆటగాడు సాధించిన గోల్ తో భారత్ కు ఓటమి తప్పలేదు.

గౌహతీ వేదికగా ఒమన్ తో ముగిసిన తొలిఅంచె పోటీలో 1-2 గోల్స్ తో ఓడిన భారత్…రెండో అంచె పోటీలోనూ సఫలం కాలేకపోయింది.

ఇప్పటి వరకూ ఆడిన ఐదు రౌండ్లలో 2 పరాజయాలు, 3 డ్రాలతో 3 పాయింట్లు మాత్రమే సాధించిన భారత్ గ్రూపు ఆఖరిస్థానంలో నిలిచింది.

మిగిలిన మూడు రెండో అంచె పోటీలలో ఖతర్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.

ఆఖరి మూడురౌండ్ల పోటీలలో భారత్ నెగ్గిన ప్రపంచ కప్ ఆసియాజోన్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించడం అంత తేలికకాదు.