బిజినెస్‌ ఐడియాలజికల్‌ విభేదాలతోనే బయటకు వచ్చా….

నటుడు నాగబాబు ఎట్టకేలకు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా నాగబాబే తన యూట్యూబ్ చానల్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ శుక్రవారంతో తన జబర్దస్త్‌ జర్నీ ముగుస్తుందని చెప్పారు.

”నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 ఫిబ్రవరి నుంచి 2019 ఈరోజు వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. అందుకే స్పందిస్తున్నా.

నేను ఈ విషయాలు వివాదాస్పదం చేయడం కోసం చెప్పడం లేదు. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంట్లో ఎవరి తప్పు లేదు.

జబర్దస్త్‌ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డికి నేను థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గటు కాకపోయినా మంచి రెమ్యూనరేషన్‌ ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. రెమ్యూనరేషన్‌ విషయంలో విభేదాలు వచ్చి వెళ్లిపోయాడనేది అబద్ధం.

నేను పారితోషికం కోసమే జబర్దస్త్‌కి రాలేదు. నాకు అది పెద్ద విషయమే కాదు. హాలిడే ట్రిప్పులా ఇన్ని రోజులు షో నడిచింది. ఈ విషయంలో మరోసారి శ్యాంప్రసాద్‌రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను. నా జర్నీ ఎలా మొదలైంది. ఎలా క్లోజ్‌ అయిందనేది తర్వాత రోజుల్లో చెబుతాను’ అని నాగబాబు వెల్లడించారు.