శత్రువులు ఏకమైనా, నిందలేసినా ప్రజల కోసం నా చేతనైనది చేస్తూనే ఉంటా….

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. ప్రజల మంచి కోసం తన చేతనైనది చేస్తూనే ఉంటానన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార దినోత్సవం సందర్భంగా ‘మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌… తన పాదయాత్రలో మత్స్యకారుల బాధలను కళ్లారా చూశానన్నారు. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోగలుగుతున్నామన్నారు.

చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని… అందుకే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ‘మత్స్యకార భరోసా’ కింద నెలకు 10వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. లక్షకు పైగా కుటుంబాలకు నేరుగా 10వేల రూపాయలు ఈరోజే బ్యాంకు ఖాతాల్లో పడతాయన్నారు.

మత్స్యకారులు వాడే బోట్లకు ఇచ్చే డిజిల్‌ రాయితీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచుతున్నామన్నారు. గతంలోలాగా కాకుండా డిజిల్ పట్టించుకునేటప్పుడే రాయితీకి డిజిల్ వేసేలా 81 పెట్రోల్‌ బంకుల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

నాడు – నేడు పథకం కింద స్కూళ్ల రూపురేఖలను మారుస్తున్నట్టు చెప్పారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. ఎన్నో మంచిపనులు చేస్తున్నా… ఏ చెడు చేయకున్నా కొందరు ఏవేవో అపనిందలు వేస్తున్నారని… ప్రజలు దీన్ని గమనించాలని సీఎం కోరారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. వెనుకబడిన ఎస్సీఎస్టీ బీసీలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తాము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే… అదే తప్పు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలు గానీ, మీడియా అధిపతులు గానీ ఎదురుపడితే వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించాలని ప్రజలకు జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. ప్రజల కోసం తన చేతనైనంత చేస్తూనే ఉంటానని… ఎంతమంది శత్రువులు ఏకమైనా, ఎన్ని అపనిందలు వేసినా వాటిని తట్టుకుని నిలబడతానన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు మాత్రం తనకు ఉంటే చాలన్నారు సీఎం.