Telugu Global
National

వెంకయ్యచౌదరి డీమ్డ్ రిలీవ్‌ మీద జంప్‌

చంద్రబాబు హయాంలో ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరి రాష్ట్రం నుంచి రిలీవ్అయి కేంద్ర సర్వీసులో చేరిపోవడం కలకలం రేపింది. విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే ఆయన కేంద్ర సర్వీసుల్లో చేరి పోస్టింగ్ కూడా తెచ్చుకోవడంతో ప్రభుత్వం షాక్ అయింది. ఈ వ్యవహారంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై సీఎస్ నీలం సాహ్ని వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, సెక్షన్ ఆఫీసర్ జి అచ్చయ్యను సస్పెండ్ చేశారు. వివాదానికి కారణమైన వెంకయ్యచౌదరి…. […]

వెంకయ్యచౌదరి డీమ్డ్ రిలీవ్‌ మీద జంప్‌
X

చంద్రబాబు హయాంలో ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరి రాష్ట్రం నుంచి రిలీవ్అయి కేంద్ర సర్వీసులో చేరిపోవడం కలకలం రేపింది. విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే ఆయన కేంద్ర సర్వీసుల్లో చేరి పోస్టింగ్ కూడా తెచ్చుకోవడంతో ప్రభుత్వం షాక్ అయింది. ఈ వ్యవహారంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై సీఎస్ నీలం సాహ్ని వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, సెక్షన్ ఆఫీసర్ జి అచ్చయ్యను సస్పెండ్ చేశారు.

వివాదానికి కారణమైన వెంకయ్యచౌదరి…. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరికి ఈయన అత్యంత అత్మీయుడు. టీడీపీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి ఏపీఎండీసీ చైర్మన్‌గా వెంకయ్య చౌదరిని చంద్రబాబు నియమించారు.

వెంకయ్యచౌదరి ఏపీఎండీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో కడప జిల్లాలోని విలువైన బైరైటీస్‌ అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి రాష్ట్ర ఖజానాకు దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. జగన్‌మోహన్ రెడ్డి సీఎం కాగానే ఏపీఎండీసీ వర్కర్స్ యూనియన్ ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది.

2016లో ఎపీఎండీసీ చైర్మన్‌గా వెంకయ్యచౌదరి నియమితులైన సమయంలో బైరైటీస్ ధర టన్ను 6వేల 100 రూపాయలు ఉండగా… వెంకయ్యచౌదరి మాత్రం టన్నుకు కేవలం 4వేల 100 రూపాయలకే… కావాల్సిన వారికి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా తక్కువ ధరకు బైరైటీస్‌ను కేవలం పది మంది వ్యక్తులే సొంతం చేసుకున్నారు. వారంతా కూడా చంద్రబాబుకు సన్నిహితులైన వారే అని అప్పట్లో వర్కర్స్ యూనియన్ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏపీఎండీసీలో వెంకయ్యచౌదరి ఎండీగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అది ఇంకా కొనసాగుతోంది. ఇంతలోనే వెంకయ్యచౌదరి డిప్యూటేషన్ గడువు అక్టోబర్‌ 10తో ముగిసింది.

వెంకయ్యచౌదరిపై అవినీతి ఆరోపణలు ఉండడం, విజిలెన్స్ విచారణ జరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సంబంధించిన రిలీవ్‌ ఫైల్‌ను పరిశీలిస్తుండగానే… వెంకయ్య చౌదరి నుంచి మరో లేఖ వచ్చింది. తన డిప్యూటేషన్ కాలం ముగిసిపోయింది కాబట్టి డీమ్డ్ రిలీవ్‌గా అంటే అధికారికంగా అనుమతి రాకపోయినా వచ్చినట్టు భావించాలంటూ లేఖ ఇచ్చారు.

ఈ లేఖ అంశాన్ని ప్రస్తుతం సస్పెండ్ అయిన జయరామ్, అచ్చయ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదన్నది ఆరోపణ. దాంతో డీమ్డ్‌ రిలీవ్‌గా భావించాలని లేఖ ఇచ్చిన వెంకయ్యచౌదరి వెళ్లి కేంద్రసర్వీస్‌లో చేరిపోయారు. పదిరోజుల క్రితం ఆయనకు జీఎస్టీ జాయింట్ కమిషనర్‌గా హైదరాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చారు.

ఈ విషయం తెలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆశ్చర్యపోయారు. విజిలెన్స్‌ విచారణ జరుగుతుండగానే వెంకయ్యచౌదరి ఎలా వెళ్లిపోగలిగారు అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. డీమ్డ్‌ రిలీవ్‌కు సంబంధించిన లేఖను జయరాం, అచ్చయ్యలు తొక్కి పెట్టడంతో వెంకయ్యచౌదరి వెళ్లి కేంద్ర సర్వీసులో చేరిపోగలిగారని గుర్తించి వారిపై వేటు వేశారు.

First Published:  23 Nov 2019 4:56 AM GMT
Next Story